ఒకే రోజు.. ఇండియా రెండు అద్భుత విజయాలు
posted on Nov 3, 2025 8:24AM

ఒకటి ఇస్రో సీఎంఎస్03 ప్రయోగం.. రెండు విమెన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా నిలవడం
ఇండియా ఆదివారం(నవంబర్ 2) రెండు చిరస్మరణీయమైన విజయాలను సాధించింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా సాధించిన ఈ విజయాలు భారత కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాయిలుగా నిలిచాయి. భారత్ ఒకే రోజు రెండు వేర్వేరు రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకటి అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో సాధిస్తే.. రెండోది క్రీడా రంగంలో భారత మహిళలు సాధించారు. ముందుగా ఇస్రో సాధించిన ఘనత విషయానికి వస్తే.. శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. . ఈ విజయం భారత్ కమ్యూనికేషన్ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. . ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన సీఎంఎస్ 03 కమ్యూనికేషన్ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ బ్యాండ్ ఉపగ్రహం అత్యున్నత సాంకేతికతతో రూపొందింది. ఈ ప్రయోగ సమయంలో వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఇస్రో సైంటిస్టులు సవాళ్లన్నిటినీ అధిగమించి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సి 25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం, మళ్లీ విజయవంతంగా రీ ఇగ్నైట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒకే మిషన్‌లో పలు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఉంచే సాంకేతిక సామర్థ్యానికి మార్గం సుగమం అయ్యిందని చెప్పాలి. . ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రగతిలో కీలక మలుపు, ముందడుగు అని ఇస్రో చీఫ్ అన్నారు.
ఇక రెండో అద్భుత విజయం.. 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సారిగా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించి సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ఆల్ మోస్ట్ ఎలాంటి అంచనాలూ లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం సృష్టించింది. నాకౌట్ స్టేజికి ముందు మూడు పరాజయాలతో.. అసలు సెమీస్ కైనా చేరుతుందా అన్న అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే హర్మన్ ప్రీత్ సేన అనూహ్యంగా, అనితర సాధ్యమన్న రీతిలో పుంజుకుంది. ఇంతకు ముందు రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ వరకూ వచ్చి కూడా కప్ అందుకోలేకపోయిన టీమ్ ఇండియా.. ఈ సారి మాత్రం కప్పు సాధించాలన్న పట్టుదలతో ఆడింది. సెమీ ఫైనల్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల నుంచి విజయం దిశగా అద్భుత పోరాటం చేసి గెలిచింది. ఆ క్రమంలో వన్డేల్లో మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఫైనల్ లోనూ ఒత్తిడిని తట్టుకుని దక్షిణాఫ్రికాపై 52 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి గర్వంగా కప్ ను ముద్దాడింది.