Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గగనతల సార్వభౌమాధికారం దిశగా ఇండియా
posted on: May 16, 2026 2:27PM

114 అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలు
భారతదేశ రక్షణ రంగ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధ సేకరణ కార్యక్రమాలలో ఒకటి తుది దశకు చేరుకుంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించే లక్ష్యంతో 114 మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ 2.0) కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనల అభ్యర్థనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ దాదాపు ఖరారు చేసింది. వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ. పి. సింగ్ సంయుక్తంగా ఫ్రాన్స్ లో జరపనున్న పర్యటనకు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశ రక్షణ చరిత్రలోనే అత్యంత వ్యూహాత్మకమైనదిగా భావిస్తున్న ఈ ఆయుధ సేకరణ ప్రక్రియ, భారత సైనిక సామర్థ్యాన్ని సరికొత్త అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లనుంది. ఈ భారీ రక్షణ ప్యాకేజీ విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3.6 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ నిధులు కేవలం యుద్ధ విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా, వాయుసేనకు అవసరమైన సమగ్ర రక్షణ వ్యవస్థల ఏర్పాటుకు ఉపయోగపడనున్నాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యంత అధునాతనమైన మీటియార్ గగనతల క్షిపణులతో పాటు, సుదూర ప్రాంతాల్లోని శత్రు స్థావరాలను గురితప్పకుండా ఛేదించగల స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు ఈ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
వీటితో పాటు ఇండియన్ పైలట్లకు అత్యుత్తమ శిక్షణనిచ్చేందుకు వీలుగా అధునాతన సిమ్యులేటర్ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నిరంతర నిర్వహణ ఏర్పాట్లు కూడా ఈ ఒప్పందంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఫ్రాన్స్ సరిహద్దు దాటి వెలుపలి ప్రపంచంలో పూర్తి స్థాయి రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా విధానానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపును తీసుకురావడమే కాకుండా.. దేశీయ రక్షణ పారిశ్రామిక రంగాన్ని అద్భుతమైన ప్రగతి పథంలో నడిపించనుంది. ఈ ప్రతిపాదనల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒప్పందం కుదిరిన తర్వాత మొదటి విడత యుద్ధ విమానాల డెలివరీలు 2030 నాటికి భారత వాయుసేనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. లక్ష్యాల సాధన కోసం ఈ 114 యుద్ధ విమానాల సేకరణను రక్షణ శాఖ ఒక క్రమపద్ధతిలో విభజించింది.
18 నుండి 22 జెట్లు ఫ్రాన్స్ నుండి నేరుగా ఎగరడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో కొనుగోలు చేయడానికి డాసాల్ట్ ఏవియేషన్ సంస్థతో భాగస్వామ్యం. అలాగే.. 92 నుండి 96 జెట్లు సాంకేతిక బదిలీ ద్వారా భారతదేశంలోనే అసెంబుల్ మరియు తయారీకి డాసాల్ట్ ఏవియేషన్, భారతీయ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలతో ఒప్పందం.
ఇక ఈ కొనుగోలు ప్రక్రియ, భారత నౌకాదళం తన విమాన వాహక నౌకల కోసం గతంలో ఆర్డర్ చేసిన 26 రఫేల్ మెరైన్ జెట్లకు పూర్తిగా భిన్నమైనదని అంటున్నారు. వాటి డెలివరీలు షెడ్యూల్ ప్రకారం 2029 నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు స్క్వాడ్రన్ల కొరతే. దేశానికి రెండు వైపులా ఉన్న సరిహద్దుల నుండి ఎదురయ్యే ద్విముఖ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టడానికి వాయుసేన నిరంతరం సరిహద్దు వ్యూహాలను సమీక్షిస్తోంది. దేశ భద్రతా నియమాల ప్రకారం వైమానిక దళానికి మంజూరైన స్క్వాడ్రన్ల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం కేవలం 29 క్రియాశీల ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సుమారు 520 యుద్ధ విమానాలతో నడుస్తున్న ప్రస్తుత వ్యవస్థలోని లోటును భర్తీ చేయడానికి ఈ 114 రఫేల్ ఎఫ్-4 విమానాల చేరిక అత్యంత కీలకంగా మారనుంది. గగనతల పోరాట సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. రక్షణ రంగాన్ని సమూలంగా ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా వాయుసేన తన హెలికాప్టర్ల విభాగాన్ని కూడా పటిష్టం చేసుకుంది.
ప్రస్తుతం దాడి, రవాణా, రక్షణ విధులను నిర్వర్తించడానికి వాయుసేన వద్ద సుమారు 900 హెలికాప్టర్లతో కూడిన భారీ విమాన సముదాయం ఉంది. ఇందులో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి సేకరించిన అపాచీ హెలికాప్టర్లు, చినూక్ భారీ రవాణా హెలికాప్టర్లతో పాటు రష్యాకు చెందిన అధునాతన రవాణా హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి అదనంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హాల్ ధ్రువ్ - సారంగ్ హాల్ ప్రచండ్ (HAL P గన్ షిప్‌లు కూడా భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్నాయి. త్వరలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ. పి. సింగ్ సంయుక్తంగా ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి పర్యటనకు ముందే ఈ 114 యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనలు ముందడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక, దౌత్య భాగస్వామ్యం మరింత పటిష్టం కానుంది. శత్రు దేశాల వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ, భారత సరిహద్దుల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, రఫేల్ ఎఫ్-4 వంటి అత్యాధునిక 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి ఆకాశంలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






