Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రహ్మోస్ ప్రయోగించకుండానే.. టర్కీని ఆటాడుకుంటోన్న ఇండియా
posted on: Jun 5, 2026 3:02PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కిష్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ఇచ్చింది. దీంతో భారత్ టర్కీకి సైలంట్ గానే వైలెంట్ షాక్ ఇచ్చింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు. మెడిటరేనియన్, కాకసస్ ప్రాంతాల్లో టర్కీ ప్రభావాన్ని సవాలు చేసే మల్టీ డైమన్షనల్ వ్యూహం. 2026 మే 22న భారత్, సైప్రస్ దేశాలు 2031 వరకు రక్షణ సహకార రోడ్‌మ్యాప్‌తో కూడిన పూర్తి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కింద సైప్రస్ అధికారికంగా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది, భారత రక్షణ సంస్థలు సైప్రస్ రక్షణ పరిశ్రమతో ఒప్పందాలు చేసుకున్నాయి.
సైప్రస్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది టర్కీలోని భద్రతా ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి- మాచ్ 2.8–3.0 వేగంతో ప్రయాణిస్తుంది, సముద్ర మట్టం నుంచి కేవలం 10 మీటర్ల ఎత్తులో క్రాలింగ్ చేస్తూ ప్రయోగించే వెసలుబాటునిస్తుంది. 2025 ఏప్రిల్ 22న, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదుల దాడి కారణంగా.. 26 మంది భారతీయులు మరణించారు. ఈ నరమేధానికి ప్రతీకారంగా.. మే 7న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై నేరుగానే దాడి చేసింది, 100 మందికి పైగా ఉగ్రవాదులు భారత వైమానిక దాడుల్లో మరణించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ వివాదంలో ఓపెన్ గానే ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్‌కు భారీగా మద్దతునిచ్చింది. దీంతో పాకిస్తాన్, టర్కీ తయారీ డ్రోన్లను ఉపయోగించింది. అంతే కాదు.. వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కిష్ వ్యక్తుల్ని సైతం నియమించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ- పాకిస్తాన్ క్షిపణులే కాదు టర్కిష్ డ్రోన్ దాడులను సైతం భగ్నం చేసింది. పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం బ్రహ్మోస్ క్షిపణితో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేసింది, ఇందులో 4 పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
ఆపరేషన్ సిందూ ర్ టైంలో.. పాకిస్థాన్ జరిపిన దాడులకు చైనా, టర్కీలు మద్దతు ఇచ్చాయని అంటారు భారత ఆర్మీ అధికారులు. పాకిస్థాన్ మిలటరీ వినియోగిస్తున్న హార్డ్ వేర్‌లో 81 శాతం చైనాదే. టర్కీ పాకిస్తాన్‌కు బహాటంగానే సాయం చేసింది. దీనిపై ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ బహిరంగంగా ఎలాంటి డ్రామా చేయలేదు, కానీ నిశ్శబ్దంగా వ్యూహాత్మక ప్రతిస్పందన ఇచ్చింది.
2026 జనవరిలో అర్మేనియాకు భారత్ 220 మిలియన్ డాలర్ల విలువ చేసే పినాక రాకెట్ సిస్టమ్ ఫస్ట్ బ్యాచ్ డెలివరీ చేసింది. ఇక 2026 మే 21న సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడీస్ భారత్ లో పర్యటించారు. మే 22న భారత్-సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నాయి. 2026–2031 మధ్య కాలంలో ఒక రక్షణ పరమైన రోడ్‌మ్యాప్ తయారైంది. బ్రహ్మోస్ కొనుగోలుపై ఇరు పక్షాలు ఒప్పందాలు చేసుకున్నాయి. మే 29న టర్కీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక టర్కీ రక్షణ రంగ నిపుణులు సైప్రస్ బ్రహ్మోస్ కొనుగోలు చేస్తే ఆ ప్రభావంపై పలు విశ్లేషణలు చేశారు.
భారత్-సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్యం- అంతర్జాతీయ న్యాయం ప్రకారం.. సార్వభౌమ దేశాల మధ్య రక్షణ సహకారం. రెండు దేశాలు.. సైబర్ భద్రత, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధక నెట్‌వర్క్‌ల బలోపేతం పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి అనేది అంతర్జాతీయ క్షిపణి నియంత్రణ రీజిమ్ ఎంటీసీఆర్ కిందకు వస్తుంది. ఫిలిప్పీన్స్ 2024లో బ్రహ్మోస్ తొలి బ్యాచ్‌ను అందుకుంది, తొలి ఎగుమతి దేశం ఇదే. భారత్ 2025 ఏప్రిల్‌లో రెండో బ్యాచ్‌ను ఫిలిప్పీన్స్‌కు పంపిణీ చేసింది.
ఇప్పుడు చూస్తే.. సైప్రస్ బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది టర్కీలో భద్రతా ఆందోళనలను పెంచుతోంది, ఎందుకంటే సైప్రస్ టర్కిష్ ప్రభావ క్షేత్రంలో ఉంది. అర్మేనియా-భారత్ రక్షణ ఒప్పందం కూడా సార్వభౌమ దేశాల మధ్య సహకారంగానే పరిగణిస్తారు. అర్మేనియా 3 బిలియన్ డాలర్లకు ఎస్యు30ఎమ్ కేఐ ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది, 220 మిలియన్ డాలర్లకు పినాక రాకెట్ సిస్టమ్స్ కోసం ఒప్పందం కుదిరింది.
భారత్ ఇందులో ఎలాంటి దాపరికాలు చేయలేదు, పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించలేదు. కానీ నిశ్శబ్దంగా సైప్రస్, అర్మేనియాలతో రక్షణ సంబంధాలను నిర్మించడం ప్రారంభించింది. రెండు దేశాలు టర్కీకి ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ఉన్నవే. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల మాట ఏంటంటే .. భారత్-సైప్రస్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. ఇది భవిష్యత్ దృష్టితో కూడుకున్నదనీ.. ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం పై ఇరుదేశాల నిబద్ధతకు ఇది తార్కాణమనీ అంటారు.
ఇక టర్కీ విషయానికి వస్తే.. ఇది నేయో-ఓట్టోమన్ విదేశాంగ విధానం అనుసరిస్తోంది. ప్రాంతీయ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది. బ్లూహోం ల్యాండ్ విధానం అనుసరించాలని భావిస్తోంది. అంటే, భూమిపై టర్కీ సరిహద్దులు ఎలా ఉన్నాయో... చుట్టుపక్కల ఉన్న సముద్రాలపై కూడా తమకు అంతే సార్వభౌమాధికారం, హక్కులు ఉన్నాయని వాదించే సిద్ధాంతం ఇది. నల్ల సముద్రం, ఈజిప్షియన్ సముద్రం, మధ్య ధరా సముద్రంపై టర్కీ తన ప్రభావం పెంచాలనుకుంటోంది.
సైప్రస్ టర్కీ విదేశాంగ విధానంలో.. అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక ప్రాంతీయ వివాదమిది. దశాబ్దాలుగా అంకారా భద్రతా లెక్కలను శాసిస్తున్న ప్రాంతం. టర్కీ తన సొంత సామ్రాజ్యంగా భావించే ఆ పొరుగు ప్రాంతంలోకి ఇప్పుడు భారతదేశం అడుగుపెట్టింది. ఇక కాకసస్ ప్రాంతంలో అర్మేనియాకు అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా భారతదేశం అవతరించింది. టర్కీ తన ప్రభావ క్షేత్రలుగా భావించే మరో సున్నితమైన ప్రాంతం ఇది. అర్మేనియా ఆజర్బైజాన్ అనే టర్కీ మిత్రదేశంతో ఘర్షణలో ఉంది. ఫ్రాన్స్ నుంచి రక్షణ సహకారం పొందుతోంది, ఇప్పుడు భారత్‌తో కూడా బలమైన భాగస్వామ్యం ఆందోళనకరంగా మారింది.
టర్కీకి లోతైన వ్యూహాత్మక ప్రయోజనాలు, చారిత్రక సంబంధాలు, ప్రత్యక్ష భద్రతా ప్రమేయం ఉన్న మరో ప్రాంతం కాకసస్. టర్కీ తన ప్రభావ క్షేత్రలుగా భావించే రెండు వేర్వేరు సున్నితమైన ప్రాంతాల్లోకి ఇప్పుడు భారతీయ ఆయుధాలు వచ్చి చేరుతున్నాయి. ఈ అంశంపై టర్కీ రక్షణ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గ్రీస్, సైప్రస్ దేశాల చేతికి బ్రహ్మోస్ క్షిపణులు వస్తే.. తూర్పు మధ్యధరా సముద్రంలో సైనిక సమతుల్యత పూర్తిగా దెబ్బ తింటుందని.. అర్దాన్ జెంటుర్క్ అనే టర్కీ డిఫెన్స్ అనలిస్ట్ హెచ్చరించాడు.
ఇటీవల భారత్, గ్రీస్, సైప్రస్ దేశాల మధ్య జరిగిన దౌత్య- రక్షణ మార్పులపై టర్కీ మీడియా, మిలిటరీ వర్గాలలో కలవరం మొదలైంది. టర్కీ రాజధాని అంకారా ఇప్పుడు ఆ చుక్కలన్నింటినీ కలుపుకుంటూ అసలు విషయం అర్థం చేసుకునే పనిలో ఉంది. భారత్ ఎలాంటి సాంప్రదాయ దౌత్యం చేయలేదు, కానీ వ్యూహాత్మకంగా టర్కీ భద్రతను ఇది ప్రశ్నార్థకం చేస్తోంది.
బ్రహ్మోస్ మధ్య పరిధి గల, ర్యామ్‌జెట్ ఇంజనుతో పనిచేసే, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. దీన్ని భూ, సముద్ర, ఆకాశ మార్గాల ద్వారా ప్రయోగించవచ్చు. సముద్ర మట్టం నుంచి కేవలం 10 మీటర్ల ఎత్తులో క్రాలింగ్ చేస్తూ వాడొచ్చు, రాడార్‌లకు కనిపించకుండా వదలవచ్చు. సైప్రస్ బ్రహ్మోస్ కొనుగోలు అంటే.. టర్కీకి నేరుగా ఇదొక సైనిక సవాలు. సైప్రస్ టర్కీ ప్రభావ క్షేత్రంలో ఉంది, ఇక్కడ భారత ఆయుధాలు ఉండటం.. టర్కీ బ్లూహోంల్యాండ్ డాక్ట్రిన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేయడం లాంటిది. ఇక్కడ వింత ఏంటంటే, టర్కీ దక్షిణాసియాలో ప్రభావం చూపాలనుకుంది.. ఇందుకు సమాధానంగా భారత్ తూర్పు మెడిటరేనియన్, కాకసస్ ప్రాంతాలలో తన ప్రభావాన్ని చూపించాలని నిశ్చయించుకుంది.
జియో పాలిటిక్స్ ని సీరియస్‌గా తీసుకునే దేశాలు ఎప్పుడూ రెచ్చగొట్టే చర్యలకు నేరుగా సమాధానం ఇవ్వవు. అవి పక్కదారి గుండా, వేరొకరి పెరట్లోనే సమాధానం చెబుతాయి. అది కూడా సైలెంట్ గా .. అవసరమైతే ఏళ్ల తరబడి వేచి చూసి మరీ దెబ్బ కొడతాయి. సూటిగా చెప్పాలంటే, భారత్ ఇచ్చిన సమాధానం కేవలం ఒక ప్రకటన కాదు. ఇది వ్యూహాత్మక ఆయుధం. టర్కీ బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది, భారత్ నిశ్శబ్దంగా టర్కీ ప్రభావ క్షేత్రాల్లోకి వెళ్లి దెబ్బ కొట్టింది. సైప్రస్, అర్మేనియా టర్కీకి కీలకమైన రెండు సునిశిత ప్రాంతాలు. అందుకే టర్కీ రక్షణ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టర్కీ ఇంకా షాక్ లోనే ఉంది. సాంప్రదాయ దౌత్యంలో దీన్ని సిగ్నలింగ్ అంటారు. కానీ ఆచరణలో ఇది అంతకంటే మించినది. శత్రువుకు ఆట మారిపోయిందని తెలిసేలోపే, వారికి అత్యంత కీలకమైన ప్రాంతాలలో మన పట్టును నిశ్శబ్దంగా సాధించడమే ఈ వ్యూహంలో అత్యంత కీలకం.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






