విదేశాల్లో దాక్కున్న నేరస్తుల వేటలో ఇండియా పురోగతి.!

posted on: Aug 7, 2026 3:33PM

విదేశాలకు పారిపోయిన మోసగాళ్లు, తీవ్రవాదులు,  గ్యాంగ్‌స్టర్లను తిరిగి దేశానికి రప్పించడంలో భారతదేశం గణనీయపురోగతి సాధించింది. గతంలో విదేశాలకు పారిపోతే శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే భావనకు చెక్ పెడుతూ, ఇండియా హోంమంత్రిత్వ శాఖ  కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ  ఆధునిక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఫలితంగా 2019 నుండి 2026 మధ్య కాలంలో దాదాపు 36   దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను  విజయవంతంగా ఇండియాకు డిపోర్ట్, ఎక్స్‌ట్రడిషన్ ద్వారా రప్పించగలిగింది. దీనితో పాటు, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి నుంచి  17వేల 874 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా,  18వేల 762 కోట్లు  రికవరీ చేసి గ్లోబల్ లీగల్ రంగంలో తనకంటూ ఒక బలమైన ముద్ర వేసింది.  

పాత బలహీనతల నుంచి నేటి దూకుడు వరకూ

ఒకప్పుడు ఇండియన్  బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసి లేదా దాడులకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి తీసుకురావడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రాసెస్‌గా ఉండేది.  2004 నుండి 2013 మధ్య కాలంలో ఏడాదికి సగటున కేవలం నలుగురు నేరస్తులను మాత్రమే భారత్ వెనక్కి తీసుకురాగలిగింది. సరైన దౌత్య  ఒత్తిడి లేకపోవడం, అసంపూర్ణ ఆధారాలు,   అంతర్జాతీయ స్థాయిలో బలమైన సమన్వయం లోపించడం వల్ల వందలాది ఎక్స్‌ట్రడిషన్ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయేవి.  అయితే 2019 తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని జాతీయ ప్రాధాన్యతగా స్వీకరించింది. దౌత్యపరమైన అనుసంధానంతో పాటు, అంతర్జాతీయ పోలీసు వ్యవస్థలతో మెరుగైన సమన్వయాన్ని ఏర్పరచుకుని నేరస్తుల నెట్‌వర్క్‌ను దెబ్బతీసింది.  2019లో ప్రారంభమైన ఈ స్పెషల్  డ్రైవ్‌లో  ఏటా స్వదేశానికి రప్పించిన  నేరస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.  2025లో గరిష్టంగా 70 మందిని, అలాగే 2026 మొదటి ఏడు నెలల్లోనే 45 మందిని భారత్‌కు తీసుకురావడం ఈ నూతన విధాన విజయానికి అద్దం పడుతోంది.  

తీసుకువచ్చిన నేరస్తుల వివరాలు,  కీలక విజయాలు

విదేశాల నుంచి రప్పించిన ఈ 274 మంది కేవలం ఆర్థిక నేరస్తులు మాత్రమే కాదు.  దేశ భద్రతకు, ప్రజా రక్షణకు ముప్పుగా మారిన పలువురు ప్రమాదకర నేరస్తులు ఉన్నారు. హోంమినిస్ట్రీ  డేటా  మేరకు  17 మంది తీవ్రవాద కార్యకలాపాలు, ప్లానింగ్‌లో భాగస్వాములు.  42 మంది ఆర్గనైజ్డ్ క్రైమ్, గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్ నిర్వాహకులు.  62 మంది హత్యలు, దోపిడీలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు.  53 మంది లైంగిక నేరాలు, పోక్సో కేసుల్లో నిందితులు.  45 మంది  ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తులు,  ఇతరులు.  ముఖ్యంగా 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారులలో ఒకడైన తహావుర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడం భారత దౌత్యవిజయంగా చెప్పవచ్చు. అలాగే  న్యాయ పోరాటంలో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది.  

న్యాయపరమైన మార్పులు

ట్రయల్ ఇన్ అబ్సెంటియా విప్లవం కేవలం విదేశాల నుండి నేరస్తులను డిపోర్ట్ చేయడమే కాకుండా, వారిని శిక్షించేందుకు భారత న్యాయ చట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఫ్యుగిటివ్ ఎకనామిక్స్ అఫెండర్స్ యాక్ట్ (ఎఫ్ఈఓఏ), పిఎమ్ఎల్ఏ చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా నేరస్తుల ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ వేగవంతమైంది.  అంతేకాకుండా, నూతన క్రిమినల్ చట్టం(బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 355,  356 నిబంధనలు  ట్రయల్ ఇన్ అబ్సెంటియాకు అవకాశం కల్పించాయి. దీని అర్థం ఒక నేరస్తుడు విదేశాల్లో దాక్కుని భారత్‌కు రాకపోయినా, అతని గైర్హాజరీలోనే న్యాయస్థానంలో విచారణ పూర్తి చేసి, తీర్పును వెలువరించవచ్చు. ఈ చట్టపరమైన వెసులుబాటు వల్ల నిందితులు విదేశాల్లో ఉండి కేసులను కాలయాపన చేసే అవకాశం లేకుండా పోయింది.  

సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్ త్రిశూల్ 

ఈ అంతర్జాతీయ వేటలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది.  ఆపరేషన్ త్రిశూల్ ద్వారా శాటిలైట్ ఇమేజరీ, డిజిటల్ ఫుట్‌ప్రింట్ మ్యాపింగ్, సర్వైలెన్స్ డేటా విశ్లేషణను ఉపయోగించి నకిలీ గుర్తింపులతో విదేశాల్లో తిరుగుతున్న నేరస్తుల సమాచారాన్ని   సేకరిస్తున్నారు.  అలాగే BHARATPOL ప్లాట్‌ఫార్మ్ ద్వారా దేశంలోని దాదాపు 1,400కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానించారు. దీనివల్ల సమాచార మార్పిడి వేగం పెరిగింది. గత మూడేళ్లలోనే ఇంటర్‌పోల్ ద్వారా 400కి పైగా రెడ్ కార్నర్ నోటీసులు   జారీ చేయించడం భారత ఏజెన్సీల పనితీరుకు నిదర్శనం.  

గ్లోబల్ సవాళ్లు,  భవిష్యత్ కార్యాచరణ

భారత ప్రభుత్వం సాధిస్తున్న ఈ విజయాలు అభినందనీయమైనప్పటికీ, కొన్ని అంతర్జాతీయ న్యాయపరమైన సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. విదేశీ కోర్టులలో ఎక్స్‌ట్రడిషన్ విచారణల సమయంలో నిందితుల తరఫు లాయర్లు భారత జైళ్లలోని మానవ హక్కుల ప్రమాణాలు, విచారణలో ఆలస్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. నిరవ్ మోదీ వంటి కేసులలో అంతర్జాతీయ న్యాయస్థానాల్లో జరిగిన వాదనలు ఇందుకు ఉదాహరణ.  కాబట్టి, నేరస్తులను విదేశాల నుండి వెనక్కి తీసుకురావడంతో పాటు, దేశంలో వారిపై జరుగుతున్న విచారణలను త్వరితగతిన పూర్తి చేసి, కఠిన శిక్షలు పడేలా చూడటమే తదుపరి ప్రధాన లక్ష్యం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా న్యాయ విచారణ పారదర్శకంగా జరిగినప్పుడే గ్లోబల్ స్థాయిలో భారత న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడుతుంది.

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.  

India extradition news, fugitive offenders, Ministry of Home Affairs, Operation Trishul, BNSS trial in absentia

google-ad-img
    Related Sigment News
    • Loading...