Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండియా డీప్ స్ట్రైక్ స్ట్రాటజీ.!
posted on: Jul 21, 2026 6:59AM

సరిహద్దుల్లో కేవలం శత్రువులను అడ్డుకోవడం మాత్రమే కాకుండా, అవసరమైతే శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసేలా భారత్ తన సైనిక వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. దేశీయ సాంకేతికతతో తయారు చేసిన శక్తివంతమైన క్షిపణులు, ఏఐ ఆధారిత డ్రోన్లతో ఇండియా తన డీప్ స్ట్రైక్ సామర్థ్యాన్ని అనూహ్య స్థాయిలో పెంచుకుంటోంది. వెయ్యి కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే ఆయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా, పొరుగున ఉన్న శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వ్యూహం వల్ల పాకిస్తాన్ మొత్తం భారత్ క్షిపణుల పరిధిలోకి రావడమే కాకుండా, చైనాలోని ప్రధాన సైనిక స్థావరాలలో దాదాపు మూడింట ఒక వంతు ఇండియా ఆయుధాల పరిధిలోకి వచ్చాయి. గతంలో ఉన్న కేవలం రక్షణాత్మక విధానాన్ని వీడి, శత్రువు గుండెల్లో భయాన్ని కలిగించే ముందస్తు దాడి వ్యూహం వైపు ఇండియా అడుగులు వేస్తోంది.
భారత వద్ద ఉన్న అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ఈ డీప్ స్ట్రైక్ వ్యూహంలో కీలకమైన ఆయుధంగా నిలిచింది. రైలు, రోడ్డు మార్గాల్లో సులభంగా తరలించగలిగే ఈ నెక్స్ట్ జనరేషన్ క్షిపణి, దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను వెయ్యి కేజీల బరువైన వార్‌హెడ్లతో ధ్వంసం చేయగలదు. ఇది పాకిస్తాన్ మూలమూలన ఉన్న ప్రాంతాలతో పాటు, ఇండియా, చైనా సరిహద్దుల్లోని చైనా మిలిటరీ క్యాంపులపై విరుచుకుపడే సామర్థ్యం కలిగి ఉంది. మరోవైపు.. రాడార్ల కంటపడకుండా తక్కువ ఎత్తులో భూమిని తాకుతూ ప్రయాణించే నిర్భయ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి శత్రువుల వాయు రక్షణ వ్యవస్థలను మాయ చేయగలదు. వెయ్యి కిలోమీటర్ల పరిధి, 450 కేజీల పేలోడ్‌తో పనిచేసే ఈ క్షిపణి ప్రత్యేకత ఏంటంటే.. లక్ష్యం వద్ద చాలా సేపు గాలిలోనే ఉండి అనుకూలమైన సమయంలో దాడి చేస్తుంది. క్వాసీ బాలిస్టిక్ ఆయుధాలు, యు నావికాదళ సామర్థ్యం అలాగే.. స్వల్ప, మధ్యస్థ శ్రేణి దాడుల కోసం భారత్ వినూత్నమైన ఆయుధ వ్యవస్థలను రూపొందించింది. 350 నుండి 500 కిలోమీటర్ల పరిధి కలిగిన ప్రళయ్ క్షిపణి, ప్రయాణం చివరి దశలో అనూహ్యమైన మార్పులు చేస్తూ శత్రువుల క్షిపణి నిరోధక వ్యవస్థలను తప్పించుకోగలదు. దీనికి తోడు ప్రసిద్ధ 'పృథ్వీ క్షిపణి, దాని నౌకాదళ రూపమైన ధనుష్ క్షిపణులు సముద్ర మట్టం నుండి, భూమి నుండి ఒకే రకమైన విద్వంసాన్ని సృష్టించగలవు. ఇవి సైన్యానికి, నౌకాదళానికి నమ్మకమైన వ్యూహాత్మక బలగంగా మారాయి.
శేష్‌నాగ్ 150.. ఏఐ ఆధారిత స్వార్మ్ డ్రోన్
ఆధునిక యుద్ధాల్లో క్షిపణుల వ్యయం కోట్లలో ఉంటున్నందున, భారత్ తక్కువ ఖర్చుతో అత్యధిక నష్టాన్ని కలిగించే ఆత్మాహుతి డ్రోన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. అందులో ముఖ్యమైనది శేష్‌నాగ్ 150. ఈ డ్రోన్ వరుసగా 5 గంటల పాటు గాలిలో ప్రయాణిస్తూ.. 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు. శేష్‌నాగ్ 150లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మదర్ కోడ్ ఆధారంగా పనిచేసే స్వార్మ్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడారు. దీనివల్ల అనేక డ్రోన్లు ఒకేసారి సమన్వయంతో శత్రువులపై గుంపుగా దాడి చేయగలవు. భారత్ సొంత నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించుకుంటూ, సాధారణ పిక్ అప్ ట్రక్కులు లేదా ఎస్యూవీల నుండి కూడా వీటిని అత్యంత వేగంగా ప్రయోగించవచ్చు.
ఆత్మనిర్భర్ భారత్.. ఆయుధ రంగంలో స్వయం సమృద్ధి
ఒకప్పుడు ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకుంటోంది. ఇది కేవలం సైనిక శక్తినే కాకుండా 'ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు అనుగుణంగా జాతీయ సాంకేతిక రంగాన్ని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు లేదా ఎగుమతి నియంత్రణల ప్రమాదం లేకుండా సొంత సాంకేతికతతో తయారవుతున్న ఈ ఆయుధ వ్యవస్థలు, విదేశీ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు కొండంత అండగా నిలుస్తున్నాయి.
భవిష్యత్ దిశగా
ప్రస్తుత క్షిపణులతో పాటు, ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ గ్లైడ్, హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల అభివృద్ధిలో భారత్ వేగంగా పురోగమిస్తోంది. ఇవి వాస్తవరూపం దాల్చితే శత్రువుకు ప్రతిస్పందించే సమయం కూడా ఉండదు. మరోవైపు పినాకా వంటి గైడెడ్ రాకెట్ వ్యవస్థల పరిధిని పెంచడం ద్వారా ఫిరంగి దళాల పరిధిని మరింత విస్తరించడం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్, ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్ధాల పాఠాలను పరిగణననలోకి తీసుకుని, భారత సైన్యం సుదూర శ్రేణి ఖచ్చితత్వ దాడులకు పెద్దపీట వేస్తోంది.
ప్రాంతీయ రక్షణ పరిణామాలు
ఉత్తర, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని ఏ మూల నుండి ప్రయోగించినా, ఈ ఆయుధ వ్యవస్థలు పొరుగు శత్రువుల సైనిక స్థావరాలను క్షణాల్లో బూడిద చేయగలవు. దూరం వెనుక దాక్కుని సురక్షితంగా ఉన్నామని భావించే శత్రువుల భావనను భారత్ పూర్తిగా చెరిపివేసింది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ స్థిరత్వం, శత్రు నిరోధకత, అధునాతన సాంకేతికతల కలయికతో భారత రక్షణ రంగం ప్రపంచ స్థాయి పవర్ హౌస్‌గా రూపాంతరం చెందడం ఖాయంగా కనిపిస్తోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
India Deep Strike Capability, Agni Prime Missile, Nirbhay Cruise Missile, Sheshnag 150 Drone, Indian Defence Modernization





