Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేపాల్ చైనా జల బంధానికి భారత్ చెక్.. ఎలా సాధ్యమైందంటే?
posted on: Jun 8, 2026 10:59AM

భారతదేశం, నేపాల్ జలవిద్యుత్ రంగంలో చైనా ప్రభావాన్ని ఒక్క నియంత్రణ సవరణ తో నిర్వీర్యం చేసిందన్న వాదనలో నిజానికి బలమైన ఆధారం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అది పూర్తిగా చెక్ పెట్టిందని చెప్పడం కంటే.. మార్కెట్ ప్రవేశాన్ని వ్యూహాత్మక ఆయుధంగా మార్చిన కఠినమైన విధాన నిర్ణయం అని చెప్పడం సముచితం. 2021 ఫిబ్రవరిలో భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన క్రాస్ బోర్డర్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ ప్రోసీజర్, చైనా వంటి భారత భూసరిహద్దు పంచుకునే మూడో దేశ ప్రభావం ఉన్న ప్రాజెక్టుల నుంచి విద్యుత్ దిగుమతులను ఆపే విధంగా రూపుదిద్దుకుంది.
నేపాల్‌కు అపార జలవిద్యుత్ సామర్థ్యం ఉన్నా, దేశీయ వినియోగం పరిమితంగా ఉండడం వల్ల.. పెద్ద ప్రాజెక్టుల ఆర్థికత ఎగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ వాస్తవికతలో భారత మార్కెట్ ప్రధాన ప్రాణవాయువుగా మారింది. హిమాలయ భౌగోళిక అడ్డంకులు, అధిక ప్రసార వ్యయం, చైనా వైపు విద్యుత్ పంపిణీకి ఆచరణాత్మక పరిమితులు నేపాల్‌ను దక్షిణ దిక్కు, అంటే భారత గ్రిడ్ వైపే దాదాపు బందీ చేశాయి. 2014 ఇండియా నేపాల్ పవర్ ట్రేడ్ అగ్రిమెంట్, తర్వాత 2018 గైడ్ లైన్స్, ఈ వాణిజ్యానికి ఒక చట్టపరమైన పరిధిలోకి తెచ్చాయి, కానీ 2021 నిబంధన ఆ ఫ్రేమ్ ని మరింత కఠినతరం చేసింది.
2021 ఫిబ్రవరిలో.. భారతదేశం క్రాస్ బోర్డర్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ ప్రోసీజర్ జారీ చేసి, పొరుగు దేశాల నుంచి విద్యుత్ దిగుమతి/ఎగుమతికి ఆమోద ప్రక్రియను నిర్ధేశించింది. ఆ విధానంలో థర్డ్ కంట్రీ ఓన్షిప్ ఫండింగ్ కంట్రోల్ గల ప్రాజెక్టులపై ఆంక్షలు ఉండటంతో, నేపాల్‌లో చైనా పెట్టుబడితో లేదా చైనా కాంట్రాక్టర్లతో ఉన్న ప్రాజెక్టులు భారత మార్కెట్‌లోకి రావడం కష్టమైంది. 2022–2023లో కొన్ని కథనాల ప్రకారం చూస్తే, భారత అధికారులు చైనీస్ ఇన్వాల్వ్ మెంట్ గల ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనడానికి నిరాకరించినట్లు, ముఖ్యంగా అప్పర్ తమకోషి వంటి ప్రాజెక్టుల విషయంలో, అస్సలు వీలు కాదని తేల్చి చెప్పారు. 2024 జనవరిలో భారత్ 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను 10 ఏళ్లలో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆ ఒప్పందం కూడా.. భారత నియంత్రణ ఫిల్టర్‌లను పూర్తిగా తొలగించలేదు.
ఈ వివాద కేంద్రం ఎక్కడుందో చూస్తే, అంతర్జాతీయ న్యాయపోరాటం కంటే భారత దేశీయ నియంత్రణ చట్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2021 ప్రొసీజర్ లోని క్లాజ్- 6.3, నైబరింగ్ కంట్రీ జనరేషన్ ప్రాజెక్ట్స్ నుంచి దిగుమతులకు థర్డ్ కంట్రీ కంట్రోల్ ఫండింగ్.. నిబంధనను జోడించి, చైనీస్ లింక్డ్ ప్రాజెక్ట్స్ ని ప్రాక్టికల్లీ అవుట్ ఆఫ్ మార్కెట్ చేసింది. కొన్ని కథనాల ప్రకారం, 2018 గైడ్ లైనన్స్ లో లేని ఈ నిబంధనను 2021 ప్రొసీజర్ లో చేర్చడం వల్ల.. నేపాల్‌లో విదేశీ పెట్టుబడులను నీరుగార్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో ఇండియాస్ సీఈఏ గైడెన్స్ కు చేసిన అమైండ్మెంట్స్ కొన్ని టెక్నికల్ ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చినప్పటికీ, స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ పేరుతో భారత గ్రిడ్‌ను నియంత్రించే సామర్థ్యం కొనసాగుతూనే ఉంది.
ఇది సాఫ్ట్ పవర్ కంటే మార్కెట్ యాక్సెస్ పవర్ కు ఉదాహరణగా చెప్పాలి. చైనా- నేపాల్‌లో డామ్స్, కాంట్రాక్టర్స్ పైనాన్సింగ్ ద్వారా స్థానం సంపాదించగా, భారతదేశం ఆ విద్యుత్‌కు ఏకైక వాణిజ్య జీవనరేఖగా ఉన్న తన భౌగోళిక ప్రయోజనాన్ని ఉపయోగించి ఆ ప్రభావాన్ని చెరిపేసింది. ఇందులో సైనిక బలప్రయోగం లేదు, దౌత్య ఘర్షణ కూడా లేదు.కానీ విధాన రూపకల్పన ద్వారా వచ్చిన ఒత్తిడి, వాస్తవానికి, పెట్టుబడి నిర్ణయాలను మార్చేసేంత తీవ్రంగా పనిచేసింది. 2023లో నేపాల్ బంగ్లాదేశ్ పవర్ కారిడార్ చర్చలూ, 2025లో బంగ్లాదేశ్ వయా ఇండియా గ్రిడ్ పవర్ ఎక్స్ పోర్ట్- ప్రారంభమవడం కూడా, భారతదేశం రీజియన్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిట్ హబ్ గా మరింత కీలకంగా మారుతున్నదని చూపుతోంది.
నేపాల్‌లో ఈ విధానంపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దీనిని భారత ఎకనామిక్ వీటో గా చూశారు, మరికొందరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పై వచ్చే ప్రతికూలత గురించి హెచ్చరించారు. కొన్ని కథనాలు, చైనా-సంబంధిత ప్రాజెక్టులు వాణిజ్య అనిశ్చితి లో చిక్కుకున్నాయని, దీనివల్ల పవర్ డెవలపర్స్ నిర్మాణం కన్నా ఓనర్షిప్ స్ట్రక్చర్ మార్పుపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని చూపిస్తున్నాయి. దీన్ని మీడియా ఎలా చూస్తోందంటే, ఇండియా ఓవర్ చైనా రేస్ లా చూస్తుండగా.. నేపాల్ మాత్రం.. స్వతంత్ర అభివృద్ధి లక్ష్యాలు, ఎగుమతి ఆధారపడ్డం, జియోపాలిటిక్స్ ప్రెషర్ మధ్య చిక్కుకున్న దేశంగా కనిపిస్తోంది.
చైనా కాంట్రాక్టర్స్ లేదా, ఆ దేశ ఫండింగ్ గల ప్రాజెక్టులు భారత మార్కెట్ నుంచి దాదాపు పూర్తిగా నిరోధించబడింది. దీంతో పెట్టుబడిదారులు భారత నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజ్ కావాల్సి వచ్చింది. దీని వలన భారత్‌తో అనుసంధానమైన నేపాల్ హైడ్రా పవర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో చైనీస్ కేపిటల్ పై ఆధారపడిన ప్రాజెక్టుల విలువ తగ్గింది. అయితే దీనిని పూర్తి నిర్వీర్యంగా కాక, షరతులతో కూడిన విధానంగా చూడాలి, ఎందుకంటే నేపాల్ ఇంధన రంగ భవిష్యత్తు, ఆర్థిక ప్రగతి పూర్తిగా.. న్యూఢిల్లీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ విశ్లేషణల్లో దీనిని సింగిల్-బయ్యర్ రిస్క్ లేదా వ్యూహాత్మక పరంగా అసిమెట్రిక్ డిపెండెన్సీ లేదా అసమానంగా ఆధారపడటం అంటారు.
ఈ కేసు దక్షిణాసియాలో మార్కెట్‌ను ఆయుధంగా మార్చే కొత్త భౌగోళిక రాజకీయ నమూనాను చూపిస్తుంది. బోర్డర్, గ్రిడ్, టారీఫ్, అప్రూవల్, ఇవన్నీ వ్యూహాత్మక మార్గాలుగా మారాయి. చైనా BRI ద్వారా లోనికి వస్తే, భారత్ రెగ్యులేషన్ ద్వారా బయటకు తోసే పరిస్థితి ఏర్పడింది; ఇది మౌలిక సదుపాయాల దౌత్యం కంటే కూడా పదను గా పనిచేసింది. అందువల్ల, ఈ ఉదంతం అభివృద్ధి కథ మాత్రమే కాదు, నియంత్రణ విధానం ద్వారా జియో పొలిటికల్ కాంటెస్ట్ ఎలా నడుస్తుందో చెప్పే వాస్తవిక కేస్ స్టడీ.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





