గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత్ విశ్వరూపం!

posted on: May 8, 2026 4:15PM

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనలో భారతదేశం తనదైన ముద్ర వేస్తోంది. కేవలం ఆయుధాల దిగుమతిదారుగా ఉన్న స్థితి నుంచి, నేడు ప్రపంచ దేశాలకు అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుకుంది. తాజాగా వియత్నాంతో కుదుర్చుకుంటున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఒప్పందం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఒప్పందం కేవలం ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే కాకుండా..  ఆగ్నేయాసియాలో చైనా ప్రాబల్యాన్ని నియంత్రించే ఒక బలమైన వ్యూహాత్మక అడుగుగా అంతర్జాతీయ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గత దశాబ్ద కాలంలో భారత రక్షణ ఎగుమతులు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో కేవలం  686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు..  2025-26 నాటికి రికార్డు స్థాయిలో  38,424 కోట్ల రూపాయలకు అంటే 4.1 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.  దాదాపు 25 రెట్ల ప్రగతిని సాధించి.. ప్రపంచ రక్షణ పటంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.  మేక్ ఇన్ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాల ద్వారా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఎగుమతి విధానాలను సరళీకరించడం ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

భారత రక్షణ దౌత్యానికి బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. రష్యాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి .. శబ్దవేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలదు. సముద్ర, భూమి,  ఆకాశ మార్గాల ద్వారా శత్రువులను అటాక్ చేయగల దీని సామర్థ్యం వియత్నాం వంటి తీర ప్రాంత దేశాలకు ఎంతో కీలకం. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఈ క్షిపణులను కొనుగోలు చేయగా.. ఇప్పుడు వియత్నాం సుమారు  6వేల కోట్ల రూపాయల విలువైన  ఒప్పందానికి మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్యాకేజీలో కేవలం క్షిపణుల సరఫరా మాత్రమే కాకుండా..  శిక్షణ, లాజిస్టికల్ సపోర్ట్,  మెయింటెనెన్స్ వంటి అంశాలు  ఉన్నాయి.

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును ఎదుర్కోవడంలో వియత్నాంకు బ్రహ్మోస్ ఒక  వ్యూహాత్మక కవచంలా పనిచేయనుంది. సముద్ర తీర రక్షణను పటిష్టం చేయడంలో ఈ క్షిపణి తిరుగులేని పాత్ర పోషిస్తుంది. గతంలో భారత్ వియత్నాంకు  ఐఎన్ఎస్ కిర్పాన్ నౌకను బహుమతిగా ఇచ్చి తన స్నేహ హస్తాన్ని అందించింది. ఇప్పుడు అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అందించడం ద్వారా, భారత్ తన పాత్రను  రక్షణ సహాయకుడి నుంచి  వ్యూహాత్మక రక్షణ భాగస్వామిగా మార్చుకుంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శక్తి సమతుల్యతను కాపాడటంలో కీలక మలుపు కానుంది.

జియోపాలిటిక్స్ పరంగా చూస్తే..  ఈ ఒప్పందం వెనుక రష్యా ఆమోదం ఉండటం గమనార్హం. మాస్కో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా భారత్ తన రక్షణ దౌత్యంలో స్వయంప్రతిపత్తి  కలిగి ఉందని స్పష్టమవుతోంది. అదే సమయంలో వియత్నాం అధ్యక్షుడు టో లామ్ భారత్ పర్యటనలో ముందుగా బోధ గయను సందర్శించడం ద్వారా..  రెండు దేశాల మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక,  ఆధ్యాత్మిక బంధాన్ని మరోసారి గుర్తు చేశారు. రక్షణ ఒప్పందాలు, ఆర్థిక భాగస్వామ్యం,  సాంస్కృతిక అనుబంధం అనే ముక్కోణపు వ్యూహంతో భారత్-వియత్నాం సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి.

భారత ప్రభుత్వం  2029-30 నాటికి రక్షణ ఎగుమతులను 50 వేల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బ్రహ్మోస్‌తో పాటు ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, తేజస్ యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థలకు గ్లోబల్ మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. లార్సన్ అండ్ టుబ్రో, టాటా, మహీంద్రా వంటి ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు  కూడా ఈ లక్ష్య సాధనలో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి. బ్రహ్మోస్ ఒప్పందం ఒక విజయవంతమైన నమూనాగా నిలిచి..  భవిష్యత్తులో మరిన్ని ఆగ్నేయాసియా దేశాలు భారత్ వైపు చూసేలా చేస్తోంది.

వియత్నాంతో కుదిరిన ఈ ఒప్పందం కేవలం క్షిపణుల విక్రయం కాదు, అది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక  నమ్మదగిన భద్రతా ప్రదాత  అనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపింది. చైనా విస్తరణవాద ధోరణుల మధ్య, తన మిత్ర దేశాలకు అండగా నిలుస్తూనే..  దేశీయ రక్షణ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో భారత్ విజయవంతమవుతోంది. ఇండో-పసిఫిక్ భద్రతా సమీకరణాల్లో భారత్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా అవతరించింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చితే https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...