Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్, రష్యా.. ఈఏఈయు వాణిజ్యం.. అవకాశమా, ఆపదల ఆహ్వానమా?
posted on: Jun 8, 2026 6:28AM

భారత్, రష్యా నేతృత్వంలోని యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చర్చలు ప్రారంభమయ్యాయి. 2024లో 69 బిలియన్ డాలర్ల రికార్డు వాణిజ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఈ ఒప్పందం భారత ఎగుమతులకు కొత్త మార్కెట్లు తెరవగలదు. సరిగ్గా అదే సమయంలో పశ్చిమ దేశాలతో ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక సమీకరణంపై కఠిన ప్రశ్నలు కూడా లేవనెత్తగలదు.
భారత్, రష్యా సంబంధం శీతలయుద్ధ కాలం నుంచి టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్‌షిప్ గా వర్ణించబడుతూ వచ్చింది. రక్షణ, అణుశక్తి, అంతరిక్షం, చమురు వంటి రంగాల్లో ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా సన్నిహిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2015లో రష్యా, కజకిస్థాన్, బెలారస్, ఆర్మేనియా, కిర్గిజిస్థాన్ కలిసి యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) ను ఏర్పాటు చేశాయి. ఇది ఒక కస్టమ్స్ యూనియన్, సింగిల్ మార్కెట్‌గా రూపుదిద్దుకుని, సుమారు 183 మిలియన్ల జనాభా, 2.5–2.6 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన బ్లాక్‌గా ఎదిగింది.
భారత్–EAEU FTA ఆలోచన 2017–2019 మధ్య మొదట చర్చకు వచ్చినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆంక్షలు, రష్యా చమురు దిగుమతుల పెరుగుదల నేపథ్యంలో ఈ ఆలోచనకు కొత్త వేగం వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ ఆంక్షల కారణంగా, రష్యా చమురు భారీ డిస్కౌంట్‌తో ఆసియా మార్కెట్లకు మళ్లింది. భారత్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది,
రష్యా, భారత దిగుమతులలో టాప్–3 సోర్స్‌గా ఎదిగింది. దీని ఫలితంగా ఇండియా ఈఏఈయు వాణిజ్యం 2024లో 69 బిలియన్ డాలర్లకు చేరింది – 2023తో పోలిస్తే 7శాతం వృద్ధి సాధించింది. అయితే ఇందులో సుమారు 64 బిలియన్ డాలర్లు దిగుమతులు.. రష్యా చమురు, ఎరువులు కాగా, కేవలం 4 నుంచి 5 బిలియన్ డాలర్లు మాత్రమే భారత ఎగుమతులుండేవి.
అంటే వాణిజ్య సమీకరణ ప్రస్తుతం రష్యా పక్షాన ఎక్కువగా ఉంది.. ఇది మొదటగా చెప్పాల్సిన వాస్తవం. 2025 ఆగస్టు 20- ToR సంతకం, FTA చర్చలకు అధికారిక శ్రీకారం. 2025 ఆగస్టు 20న మాస్కోలో భారత్, EAEU మధ్య ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్- చర్చలు ప్రారంభించేందుకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై సంతకాలు జరిగాయి.
భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భడూ, యూరేషియన్ ఎకనామిక్ కమిషన్- (EEC) ట్రేడ్ పాలసీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మిఖాయిల్ చెరెకాయెవ్, ఈ ToRపై సంతకాలు చేశారు. PIB ప్రకటన ప్రకారం, ఈ FTA లక్ష్యాలు ఎలాంటివంటే.. భారత ఎగుమతులకు కొత్త మార్కెట్లు, ఎమ్ఎస్ఎమ్ఈలకు మద్దతు, మార్కెట్ వైవిధ్యీకరణ, నాన్–మార్కెట్ ఎకనామీస్ తో పోటీలో భారత స్థానం బలపరచడం.
ఇక పుతిన్–మోడీ చర్చలు, 2030 లక్ష్యం ఎలాంటిదంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇటీవల ఒక అంతర్జాతీయ వేదికలో, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను లిబరలైజ్ చేసే దిశగా చర్చలు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 2030 నాటికి భారత్–రష్యా వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా చెప్పారు – ఇది అధికారిక ToR ప్రకటనలతో కూడా సింక్‌లో ఉంది.
ToR సంతకం అంటే FTA ఖాయం అన్న మాట కాదు. కానీ ఇది ఒక స్పష్టమైన రాజకీయ–ఆర్థిక సంకేతం. భారత్, పశ్చిమ ఆంక్షల ఒత్తిడిని లెక్కచేయకుండా, రష్యా–EAEUతో దీర్ఘకాలిక వాణిజ్య అక్షాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది.
ఇక న్యాయపరమైన అంశాలు – FTA, WTO, ఆంక్షలు, రూపాయి–రూబుల్ సమీకరణ విషయానికి వస్తే.. భారత్–EAEU FTA ఒకసారి కుదిరితే, అది.. WTO ఆర్టికల్ XXIV పరిధిలోని రీజినల్ ట్రేడ్ అగ్రిమెంట్‌గా, సుంకాల తగ్గింపు, నాన్–టారిఫ్ అడ్డంకుల తొలగింపు, రూల్స్ ఆఫ్ ఆరిజిన్, సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్, IPR వంటి అంశాలను కవర్ చేసే సమగ్ర ఒప్పందంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. PIB ప్రకటన ప్రకారం, ToR నెగోషియేషన్ ఫ్రేమ్‌వర్క్, సెక్టార్–వైజ్ చర్చల నిర్మాణం, సమయరేఖలు, సంస్థాగత వ్యవస్థ.. వంటి అంశాలను నిర్దేశిస్తుంది.
రష్యా ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ యూనియన్, G7 ఆంక్షల కింద ఉంది. రష్యాతో పెద్ద స్థాయిలో వాణిజ్య–ఆర్థిక సమీకరణ, CAATSA- కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్- ద్వితీయ ఆంక్షలు.. ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది – ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ రంగాల్లో.
ఇప్పటికే రష్యా చమురు చెల్లింపుల విషయంలో.. రూపాయి–రూబుల్, దిర్హామ్, యువాన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు, ఇండియన్ బ్యాంకులపై అమెరికా ఒత్తిడి వంటి అంశాలు వార్తల్లోకి వచ్చాయి. FTA ద్వారా ఈ వాణిజ్యాన్ని మరింత సంస్థాగతం చేస్తే, పశ్చిమ ఒత్తిడి కూడా మరింత వ్యవస్థీకృతంగా రావచ్చు – ఇది భారత విదేశాంగ–వాణిజ్య వ్యూహానికి కఠిన పరీక్ష.
భారత అంతర్గత న్యాయ–పాలసీ పరిమితులు అనే అంశం పరిశీలిస్తే.. భారత్ ఇప్పటికే.. UAE, ఆస్ట్రేలియా, UKతో FTAలు, EU, USతో చర్చలు నడుపుతోంది. EAEU–FTAలో సుంకాల తగ్గింపు .. దేశీయ ఉత్పత్తిదారులపై ప్రభావం, మేకిన్ ఇండియా లక్ష్యాలపై ప్రభావం, రూల్స్ ఆఫ్ ఆరిజిన్
చైనా వంటి మూడో దేశాలు EAEU ద్వారా బ్యాక్‌డోర్ గా భారత మార్కెట్‌లోకి రావడాన్ని అడ్డుకోవడం వంటి అంశాలు న్యాయపరంగా, పాలసీ పరంగా అత్యంత కీలకం.
భారత్ అధికారికంగా స్ట్రాటజిక్ ఆటానమీను పాటిస్తున్నామని చెబుతోంది. QUADలో అమెరికా–జపాన్–ఆస్ట్రేలియాతో, BRICSలో రష్యా–చైనాతో, ఇప్పుడు EAEU–FTA ద్వారా రష్యా బ్లాక్‌తో. EAEU–FTA, పశ్చిమ ఆంక్షల నేపథ్యంతో చూస్తే, ఇది నాన్–అలైన్‌మెంట్ 2.0 నుంచి మల్టీ–అలైన్‌మెంట్ 2.0 కి మార్పు
అనే విశ్లేషణకు బలం చేకూర్చుతోంది.
దేశీయ రాజకీయ చర్చలో భాగంగా చూస్తే.. ఒక వైపు రష్యా–భారత్ స్నేహం, చౌక చమురు, ఆర్థిక స్వావలంబన కథనం, మరో వైపు పశ్చిమ దేశాలతో సంబంధాలు, టెక్నాలజీ, పెట్టుబడులు, మార్కెట్ యాక్సెస్ కథనం.. క్లాష్ అయ్యే అవకాశం ఉంది. రష్యా కోణం – పశ్చిమ ఆంక్షల మధ్య లైఫ్‌లైన్ మార్కెట్.. రష్యా దృష్టిలో భారత్- చమురు, గ్యాస్, ఎరువుల కోసం పెద్ద, స్థిర మార్కెట్, పశ్చిమ ఆంక్షల మధ్య ఆర్థిక–వాణిజ్య లైఫ్‌లైన్, జియోపాలిటికల్ లెజిటిమసీ ఇచ్చే భాగస్వామి. పుతిన్ భారత్‌తో వాణిజ్య ఒప్పందాలను లిబరలైజ్ చేస్తున్నాం అని చెప్పడం, రష్యా తన ఆర్థిక భవిష్యత్తును ఆసియా–గ్లోబల్ సౌత్ వైపు మళ్లిస్తున్న సంకేతంగా మారింది.
దేశీయ మీడియా, సోషల్ మీడియా చర్చల్లో చూస్తే.. చౌక చమురు, చౌక ఎరువులు – రైతులకు, వినియోగదారులకు లాభం అన్న కథనాలు కనిపిస్తున్నాయి. రష్యా–భారత్ స్నేహం, పాశ్చాత్య ద్వంద్వ వైఖరి అనే అంశాలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. కానీ తక్కువగా చర్చకు వస్తోన్న ప్రశ్నలేవని చూస్తే- 69 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో భారత ఎగుమతుల వాటా ఎంత? FTA తర్వాత చైనా, ఇతర నాన్–మార్కెట్ ఎకనామీస్- EAEU ద్వారా భారత మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఎంత? ఇక పశ్చిమ ఆంక్షల మధ్య బ్యాంకింగ్–ఫైనాన్స్ రంగంపై ఒత్తిడి ఎలా మేనేజ్ చేస్తాం? ఈ FTA కేవలం స్నేహగాథ మాత్రమే కాదు.. ఇది కఠిన ఆర్థిక–జియోపాలిటికల్ లెక్కల ఆట. ప్రభావాలు, ప్రజా చర్చ – ఎవరికీ లాభం, ఎవరికీ ప్రమాదం? అన్న ప్రశ్నలున్నాయి.
ఎగుమతుల అవకాశాలు – ఫార్మా, టెక్స్‌టైల్స్, అగ్రి, ఇంజినీరింగ్.. PIB, బిజినెస్ మీడియా విశ్లేషణల ప్రకారం.. EAEU–FTA ద్వారా భారత ఎగుమతులకు ప్రధాన అవకాశాలు ఎలాంటివో చూస్తే..
ఫార్మాస్యూటికల్స్ – జనరిక్ మందులు, APIs, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, వ్యవసాయ ఉత్పత్తులు – టీ, కాఫీ, మసాలాలు, బియ్యం, ప్రాసెస్డ్ ఫుడ్, ఇంజినీరింగ్ గూడ్స్ – మెషినరీ, ఆటో కంపోనెంట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, MSMEలకు కొత్త మార్కెట్లు, తక్కువ సుంకాలు, లాజిస్టిక్స్ కారిడార్‌ల ద్వారా లాభం పొందే అవకాశం ఉంది.
దిగుమతుల ప్రభావం.. చౌక చమురు, కానీ డచ్ డిసీజ్ ప్రమాదం? రష్యా, EAEU నుంచి చమురు, గ్యాస్, ఎరువులు, మెటల్స్, మెషినరీ దిగుమతులు తక్కువ సుంకాలతో వస్తే, ఇంధన ధరల స్థిరత్వం, వ్యవసాయ ఇన్‌పుట్ ఖర్చుల తగ్గింపు, ఇండస్ట్రీకి చౌక రా మెటీరియల్స్ లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి.
కానీ దీర్ఘకాలంలో.. చౌక దిగుమతుల వల్ల దేశీయ ఉత్పత్తి, రిఫైనింగ్, ఎరువుల రంగంపై ఒత్తిడి.
డచ్ డిసీజ్ అంటే, ఒక దేశంలో ఏదో ఒక నిర్దిష్ట రంగం.. ముఖ్యంగా సహజ వనరులు లేదా చమురు వంటివి.. అకస్మాత్తుగా విపరీతంగా అభివృద్ధి చెంది, దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం రావడం వల్ల... మిగిలిన రంగాలు, మరీ ముఖ్యంగా తయారీ రంగం, వ్యవసాయం దెబ్బతినే ఆర్థిక పరిస్థితిని డచ్ డిసీజ్ అంటారు. ఇది ఎటువంటి శారీరక రుగ్మత లేదా ఆరోగ్య సమస్య కాదు, ఇది ఒక ఆర్థికపరమైన లోపం. ఈ తరహా నిర్మాణాత్మక అసమతుల్యత ప్రమాదం కూడా ఉంది – ఇది పాలసీ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.
భారత ఎగుమతులు గణనీయంగా పెరిగితే – ఇది నిజమైన భాగస్వామ్యం. దిగుమతులే మరింత పెరిగితే – ఇది డిపెండెన్సీ ట్రాప్. ప్రస్తుతం 69 బిలియన్‌లో.. 90శాతానికి పైగా రష్యా–EAEU ఎగుమతులే. FTA తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగితే, భారత వాణిజ్య లోటు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
చౌక చమురు, చౌక ఎరువులు- చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యంలో అడగాల్సిన ప్రశ్నలు ఎలాంటివంటే.. ఈ FTA వల్ల భారత MSMEలు నిజంగా ఎంత లాభపడతాయి? చైనా, ఇతర నాన్–మార్కెట్ ఎకనామీస్ EAEU ద్వారా బ్యాక్‌డోర్ గా రావడాన్ని ఎలా అడ్డుకుంటాం? పశ్చిమ ఆంక్షల మధ్య బ్యాంకింగ్–ఫైనాన్స్ రిస్క్‌ను ఎలా మేనేజ్ చేస్తాం? వాణిజ్య అసమతుల్యతను తగ్గించే స్పష్టమైన స్ట్రాటజీ ఉందా? వంటి వాటికి సమాధానాలు రాబట్టాల్సి ఉంది.
పుతిన్ ప్రకటన, ToR సంతకం, 69 బిలియన్ డాలర్ల వాణిజ్యం – ఇవన్నీ కలిపి చూస్తే, భారత్–రష్యా–EAEU అక్షం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇది భారత్‌కు భారీ అవకాశాలు తెరవగలదు. సరిగ్గా అదే సమయంలో పశ్చిమ ఆంక్షలు, వాణిజ్య అసమతుల్యత, చైనా బ్యాక్‌డోర్ ప్రవేశం వంటి ప్రమాదాలను కూడా పెంచగలదు. స్నేహపు భావోద్వేగం దాటి, కఠిన ఆర్థిక–జియోపాలిటికల్ లెక్కలతో ఈ ఒప్పందాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






