అరసవల్లిలో మంగ్లికి అనుచిత ప్రాధాన్యం.. కూటమి క్యాడర్ లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది.  వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హ‌ద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలికొదిలేశాడు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది.

అదలా ఉంటే.. జగన్ విధానాలను వ్యతిరేకించిన వారినీ, తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులకు కొదవే లేదు. నిజం జగన్ అధికారం వెలగబెట్టిన ఐదేళ్లూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలపై వేధింపులతో చెలరేగిపోయారు. ఆయన అండ చూసుకుని ఆ పార్టీ నేతలూ, అభిమానులుగా చెప్పుకున్న వారూ కూడా చెలరేగిపోయారు. 

సరే జనం జగన్ పాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా ఆ పార్టీ తగదని తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది.  వైసీపీ హయాంలో మంచీ చెడూ విచక్షణ లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలూ, వారి అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలూ అధికారులపై తెలుగుదేశం కూటమి సర్కార్ కొరడా ఝుళిపిస్తుందనీ, వారిని చట్టంముందు నిలబెట్టి శిక్షిస్తుందనీ ఆశించిన తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కూడా   జగన్ హయాంలో అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయిన ఆ పార్టీ యాక్టివిస్టులను చూసీ చూడనట్లు వదిలేస్తుండటమే ఇందుకు కారణం. అంతే కాదు వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజచమర్యాదలు పొందుతుడటంతో క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

 వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం లభించడం.. తాజాగా రథ సప్తమి నాడు అరసవల్లిలో గాయని మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రొటో కాల్ దర్శనానికి అనుమతించడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతోంది.

వైపీపీ హయాంలో సింగర్ మంగ్లి టీటీడీలో పదవి అనుభవించిన సంగతి తెలిసిందే. అటువంటి మంగ్లి తాజాగా అరసవెల్లి రథ సప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటో కాల్ దర్శనం చేసుకోవడం.. మంత్రి పక్కనే నిలబడి మీడియాతో  మాట్లాడటం  తెలుగుదేశం కార్యక ర్తలకు మింగుడు పడటం లేదు.  టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మంగ్లికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంత ప్రాధాన్యాన్నీ, గౌరవ మర్యాదలనూ ఇవ్వడమేంటంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యర్థుల పట్ల అవసరం లేని మెతకతనం చూపుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మంగ్లీ విషయంలో కార్యకర్తల ఆగ్రహం ఒకింత ఇబ్బందికరమే అనడంలో సందేహం లేదు.