పాకిస్థాన్ నేషనల్ హీరో ఇమ్రాన్ ఖాన్.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలి!

posted on: Feb 16, 2026 8:56AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షిణిస్తుండటం పట్ల పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న  తమ కెప్టెన్  ఇమ్రాన్ కు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని  డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి, ఒక జాతీయ హీరోగా ఇమ్రాన్‌కు దక్కాల్సిన గౌరవం, వైద్యం అందించాలని వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి మాజీ స్టార్లు సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు.

అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటి చూపును 85 శాతం  కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. రక్తం గడ్డకట్టడం వల్ల 'సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్' అనే తీవ్రమైన సమస్య తలెత్తినట్లు వైద్యులు ఆ నివేదికలో నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు కేవలం 15 శాతం దృష్టి మాత్రమే మిగిలి ఉందని తెలియడంతో ఆయన అభిమానులు, క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 2023 సెప్టెంబర్ నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్నారు.

గత ఏడాది అక్టోబర్ నుంచే కంటి సమస్యలతో బాధపడుతున్నా, జైలు అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పాకిస్థాన్ సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లడంతో, కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షల్లో ఇమ్రాన్ 85శాతం కంటి చూపును కోల్పోయినట్లు వెల్లడైంది.  రాజకీయాలతో సంబంధం లేకుండా ఇమ్రాన్ ఖాన్ పాక్ నేషనల్ హీరో అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని క్రీడాలోకం డిమాండ్ చేస్తున్నాది.

ఇమ్రాన్ ఖాన్ 1992  ప్రపంచ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టు క్యాప్టెన్. వరల్డ్ కప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్. దేశంలో  క్యాన్సర్ హాస్పిటల్ కట్టించిన వితరణశీలి. అలాంటి వ్యక్తికి సరైన చికిత్స అందించాలని అని పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్  కోరారు. షాహిద్ అఫ్రిది, రమీజ్ రాజా వంటి అనేక మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...