ఇమ్రాన్ పిలిచాడు! ఇండియన్స్ వెళుతున్నారు! సబబేనా?

అంతర్జాతీయ రాజకీయాల్లో ఆహ్వాన రాజకీయాలు వేరు! అవేంటి అంటారా? ఒక దేశ అధినేతని తమ దేశానికి రమ్మని మరో దేశాధినేత ఆహ్వానించటమే ఈ వెల్ కమ్ పాలిటిక్స్! ఇవి ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. అయితే, మోదీ వచ్చాక మన దేశానికి కాస్త ఎక్కువయ్యాయి. ఇంతకు ముందు మన ప్రధానులు, రాష్ట్రపతులు దశాబ్దాల పాటూ ఒకే విదేశాంగ విధానంతో కొనసాగే వారు. కానీ, మోదీ వచ్చాక ఈ దేశం, ఆ దేశం అంటూ తేడా లేకుండా అన్నిట్నీ చుట్టి వస్తున్నారు. అందు కోసం ఆయన్ని విమర్శించే వార్ని పక్కన పెడితే ఒక దేశాధినేతగా ఆయన అలా అనేక దేశాలతో సంబంధాలు నెరపటం హర్షించదగిందే.

 

 

అమెరికా మొదలు ఆఫ్రికా దేశాల వరకూ మోదీ ఇప్పటి దాకా చాలా దేశాల్నే పర్యటించారు. అయితే, వాటిలో ప్రధానమైనవి అమెరికా, యూరప్, ఇజ్రాయిల్ వంటివి చెప్పవచ్చు. ఈ దేశాలకు వెళ్లిన మోదీ కొన్ని దేశాల అధినేతల్ని మన దేశానికి రమ్మని పిలిచారు కూడా! వారు చాలా వరకూ పాజిటివ్ గానే స్పందించారు ఆయా నేతలు. చైనా తరువాత అత్యంత వేగంగా దూసుకుపోతోన్న ఆర్దిక వ్యవస్థతో వున్న భారత్ ఎవర్ని ఆహ్వానించినా ఇప్పుడు సంతోషంగా వస్తారనే చెప్పుకోవచ్చు. మనల్ని ఎప్పుడూ ఆర్థిక రంగ శత్రువుగా చూసే చైనా కూడా ఇండియా నుంచీ వెల్ కమ్ మెసేజ్ రాగానే ఆనందంగా వచ్చేస్తోంది. భారత్ లో ఇప్పటికే జిన్ పింగ్ సందడి చేశారు.

 

 

అమెరికా గత అధ్యక్షుడు ఒబామా మన దేశానికి మోదీ ఆహ్వానంపైనే వచ్చారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన గ్రాండ్ వెల్ కమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా రావాలని భావిస్తున్నారట. ఇంకా డిసైడ్ కాలేదని చెబుతోన్న ఆయన రాకపోవటానికి పెద్ద కారణాలైతే కనిపించటం లేదు. ఇండియాతో, మోదీతో ట్రంప్ కు కొన్ని భేదాభిప్రాయాలు వున్నా ఆయన మన ఆహ్వానాన్ని మన్నించే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే ఆయన కూతురు ఇవాంక ట్రంప్ ఇక్కడికి వచ్చి వెళ్లి ఇండియా గురించి, మోదీ గురించి గొప్పగా అభిప్రాయం వెలిబుచ్చింది.

 

 

ఆహ్వాన రాజకీయాల్లో మరో కోణమూ వుంటుంది. ఏ చిన్న దేశాధినేత వచ్చినా మోదీ స్వయంగా వెళ్లి ఆలింగనం చేసుకుని వెల్ కమ్ చెబుతారు. కానీ, కెనడా పీఎం వస్తే అస్సలు పట్టించుకోలేదు. ఇందుకు కారణం ఆయన ఖలిస్థాన్ వేర్పాటువాదులకి మద్దతు పలుకుతుండటమే. ఇది ఒకరకంగా నిరసన తెలపటమే! ఇలా వెల్ కమ్ పాలిటిక్స్ జోరుగా సాగిస్తున్నారు మోదీ. అయితే, పాకిస్తాన్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోదీని ఆహ్వానించాలా వద్దా అని ఆలోచనలో వున్నారట! స్వాగత రాజకీయాల్లో ఆరితేరిన మోదీ తీరా పిలిచాక రానంటే పరువు పోతుందని పాక్ అధికారులు ఇమ్రాన్ ని హెచ్చరిస్తున్నారట.

 

 

మోదీ తాను ప్రధానిగా ఎన్నిక కాగానే ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించారు. అలాగే, నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లికి అనూహ్యంగా పక్కదేశంలో దిగిపోయారు. తన వ్యక్తిగత భద్రతని కూడా ఆయన రిస్క్ చేశారు. మరి ఇప్పుడు ఇమ్రాన్ ఆహ్వానం మన్నిస్తారా? ఇది పెద్ద ప్రశ్నే! మోదీ ఇమ్రాన్ ప్రమాణానికి హాజరైతే అది పాకిస్తాన్ తో మనం సత్సంబంధాలు కోరుతున్నామని సంకేతాలు ఇస్తుంది. కానీ, నిత్యం మన సైనికుల్ని పొట్టన పెట్టుకుని, కాశ్మీర్ లో రాళ్ల వర్షం కురవటానికి కారణమై, ఉగ్రవాదుల్ని ఎగదోస్తోన్న పాక్ ను ఎలా అంగీకరించగలం? సామాన్య భారతీయులు, సైన్యం చచ్చిపోతుంటే… అదే దేశానికి అతిధులుగా వెళ్లి సంబరాల్లో పాల్గొనటం హర్షనీయం కాదు! ఈ కోణంలో తప్పక మోదీ ఆలోచించాలి! ఇప్పటికే గవాస్కర్, సిద్దూ, కపిల్ దేవ్, ఆమీర్ ఖాన్ వంటి వారు ఇమ్రాన్ వెల్ కమ్ చెప్పగానే ట్రావెల్ బ్యాగులతో రెడీ అయిపోయారు. మోదీ కూడా వెళితే అది పూర్తిగా తప్పుడు సంకేతమే అవుతుంది. కుక్క తోక వంకర లాంటి పాక్ ను పనిగట్టుకుని వెళ్లి హాజరై ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు. అదీ సైన్యం సహకారంతో గద్దెనెక్కుతోన్న ఇమ్రాన్ ను అస్సలు ప్రొత్సాహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం ఈ రెండూ ఇమ్రాన్ పరిష్కరిస్తాడని ఆశించటం… అత్యాశ తప్ప మరొకటి కాదు!