మద్యం కుంభకోణం ప్రభావం.. జగన్ పాదయాత్ర 2.o అంత వీజీ కాదా?

posted on: Jun 11, 2026 10:41AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్  మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలలో తన ఘన విజయానికి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వడమే కారణమని భావిస్తున్న ఆయన మరో సారి అదే వ్యూహంతో ముందుకు వెళ్లలని నిర్ణయించుకున్నారు.  అయితే.. ఆయన పాదయాత్ర 2.o అంత వీజీ కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను రానున్న రోజులలో  న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.  జగన్ హయాంలో  జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా   వైసీపీ   హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.   ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు  వేగం పుంజుకోవడంతో జగన్ కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతోంది. 

వాస్తవానికి   కొన్ని రోజుల క్రితం వరకూ   వైసీపీ అసలు రాష్ట్రంలో మద్యం కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చారు.  అయితే  మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  అక్రమ మద్యం కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం   గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించి, వైఎస్ జగన్‌ పీఏగా  పనిచేసిన కేఎన్ఆర్ నుంచి   వైసీపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అటెండర్ మనోహర్ వరకు ప్రతి ఒక్కరినీ   క్షుణ్ణంగా విచారించింది. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఇక ఇహనో, ఇప్పుడో ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఎదురౌతుందని అంటున్నారు. 

 జగన్ మాజీ పీఏ కేఎన్ఆర్ ఆస్తులు, ఆయన విదేశాలకు తరలించినట్లుగా భావిస్తున్న భారీ నిధులు, ఆ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై ఈడీ  ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.  ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల చెయిన్..  జగన్ చుట్టూ తిరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై  రాజకీయ,  అధికార వర్గాల్లో  చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో  జగన్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆ కారణంగానే..  ఇప్పటికే ప్రకటించినట్లుగా పాదయాత్ర చేపట్టే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు.  ఒకవేళ కేసుల తీవ్రత పెరిగి, చట్టపరమైన చర్యలు గనుక ముమ్మరమైతే అది ఆయన రాజకీయ పర్యటనలకు,  ప్రజాక్షేత్రంలో తిరగడానికి  ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  కోర్టులు, విచారణలు, ఈడీ,  సిట్ అధికారుల ఎదుట హాజరుకావడం వంటి వాటితో ఆయన పాదయాత్ర చేపట్టడం అంత వీజీకాని పరిశీలకులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...