కొత్త రికార్డుల దిశగా పసిడి పయనం.. డీబేస్మెంట్ ట్రేడ్ ఎఫెక్ట్!

posted on: Apr 18, 2026 10:56AM

అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ప్రస్తుతం  పసిడి ధరల పెరుగుదలపైనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు భవిష్యత్తులో ఊహించని రీతిలో భారీ గరిష్టాలను చేరుకోనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం వెల్స్ ఫార్గో  తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..  2027   నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా 8,000 డాలర్ల మార్కును తాకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న  డీబేస్‌మెంట్ ట్రేడ్  ధోరణే ఇందుకు ప్రధాన కారణమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఓహ్ సంగ్ క్వాన్  అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలు, కరెన్సీల విలువ పడిపోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను పసిడి వైపు  మొగ్గు చూపేలా చేస్తున్నాయి. సాధారణంగా డీబేస్‌మెంట్ ట్రేడ్ అంటే.. పేపర్ కరెన్సీ (ఫియట్ కరెన్సీ) పై నమ్మకం తగ్గినప్పుడు.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి స్థిరమైన విలువ కలిగిన  అసెట్స్‌లోకి మార్చుకుంటారు. 

అభివృద్ధి చెందిన దేశాలలో విపరీతంగా పెరిగిపోతున్న అప్పులు, నోట్ల ముద్రణ కారణంగా డాలర్, యూరో వంటి కరెన్సీల వాస్తవ విలువ అంతకంతకూ  క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో సంపదను కాపాడుకోవడానికి పసిడిని మించిన సురక్షిత మార్గం మరొకటి లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వెల్స్ ఫార్గో విశ్లేషణ ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నాలుగో  కరెన్సీ డీబేస్‌మెంట్ సైకిల్ లో ఉంది. ఈ సైకిల్ 2022లో ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి సైకిల్స్ సగటున ఎనిమిదిన్న సంవత్సరాల పాటు కొనసాగుతాయి. కాగా  ప్రస్తుతం ఈ కాలవ్యవధిలో కేవలం మూడున్నరేళ్లు  పూర్తి అయ్యింది.  అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో పసిడి ధరల ర్యాలీ కొనసాగుతుంది. గతంలో గ్రేట్ డిప్రెషన్ సమయంలో,  1971లో డాలర్ నుంచి గోల్డ్ స్టాండర్డ్ తొలగించినప్పుడు కూడా ఇలాంటి భారీ ధరల పెరుగుదల కనిపించిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పసిడి దూకుడుకు కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాకుండా..  పెరుగుతున్న జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా తోడవుతున్నాయి. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అలాగే , మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రిస్క్‌ను పెంచుతున్నాయి. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను  సేఫ్ హెవెన్ గా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నారు.  అలాగే..  ప్రపంచవ్యాప్తంగా   వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలను తగ్గించుకుంటూ..  భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  పేపర్ కరెన్సీల కొనుగోలు శక్తి పడిపోవడమే పసిడి ర్యాలీకి  అసలైన ఇంధనమని  పేర్కొన్నారు. 

2025లో బంగారం సుమారు 65 శాతం రాబడిని అందించి, స్టాక్ మార్కెట్  కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాల ఆర్థిక లోటులు పెరగడం..  ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అస్థిరమైన వడ్డీ రేట్ల కారణంగా బంగారం ధరలు నిలకడగా పెరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి.అయితే..  ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తప్ప పసిడి ధరలు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం అనూహ్యంగా తగ్గిపోయి, వడ్డీ రేట్లు పెరిగినట్లయితే పసిడి ధర కొంత మేర దిగివచ్చే అవకాశం ఉంది.    

కానీ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను బట్టి చూస్తే..  ఈ నెగటివ్ సెంటిమెంట్ వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్లు  గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని వెల్స్ ఫార్గో నివేదిక చెబుతోంది. మొత్తంగా చూస్తే..  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక భారీ మార్పు దశలో ప్రయాణిస్తోంది. డాలర్ ఆధిపత్యంపై పెరుగుతున్న ప్రశ్నలు,  పేపర్  కరెన్సీలపై తగ్గుతున్న నమ్మకం కారణంగా బంగారం   ప్రాధాన్యతను పెరిగిపోతోంది. అందుకే దీర్ఘకాలికంగా సంపదను భద్రపరుచుకోవాలనుకునే వారికి పసిడి మాత్రమే సేఫ్ అనే పరిస్థితులు ఉన్నాయనడంలో ఇసుమంతైనా  సందేహం లేదు.

-సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...