హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష
posted on: Feb 8, 2026 2:35PM
.webp)
పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులు, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం లోని దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ లో 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో వారిని హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్ధులు కడుపు నొప్పి, వాంతులు రావటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. హాస్టల్ లోని మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు వివరించారు.
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు....ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇనస్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ...రంపచోడవరం ఏరియా అస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటి లోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ ను అదేశించారు. ఘటనకు కారకులపై శాఖా పరమైన చర్యలతో పాటు.....అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.



.webp)


