తమిళ గడ్డపై రాజుకున్న భావజాల యుద్ధం.. అన్నమలై వర్సెస్ ఉదయనిధి

posted on: May 14, 2026 2:04PM

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమిళనాడు రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక   భావజాల యుద్ధానికి వేదికగా మారింది. దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతాల పునాదులపై నడుస్తున్న ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి  సనాతన ధర్మం  అనే అంశం సరికొత్త ఘర్షణ రేఖలను గీస్తోంది. ఒకవైపు సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని  విపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి  ఉదయనిధి స్టాలిన్ పిలుపునిస్తుండగా, మరోవైపు అది భారతీయ నాగరికతకు మూలమని, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీత చదవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   అన్నమలై సవాల్ విసురుతున్నారు. ఈ ఇద్దరు యువ నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. లోతైన చారిత్రక, సాంస్కృతిక చర్చలను లేవనెత్తుతోంది.

ఈ వివాదానికి ప్రధాన కారణం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోల్చిన ఆయన, దానిని కేవలం వ్యతిరేకించడం సరిపోదని, పూర్తిగా తుడిచిపెట్టాలని అన్నారు. మళ్లీ అసెంబ్లీ వేదికగా దాదాపుగా అవే మాటలు అన్నారు.  దీనికి ప్రతిగా అన్నమలై స్పందిస్తూ..  ఉదయనిధికి భగవద్గీతను బహుమతిగా ఇస్తాననీ, దానిని అధ్యయనం చేస్తేనే సనాతన ధర్మంలోని అసలు అర్థం బోధపడుతుందని ఎద్దేవా చేశారు. మానవ గౌరవం, సమానత్వం,  బాధ్యతాయుతమైన జీవనమే సనాతన ధర్మం  అంతస్సూత్రమని పేర్కొన్నారు. 

ఈ భావజాల పోరాటంలో అన్నమలై ప్రధానంగా ఆర్య, ద్రావిడ సిద్ధాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విభజన సిద్ధాంతం బ్రిటిష్ వారు, క్రైస్తవ మిషనరీలు భారతీయులను విడదీయడానికి సృష్టించిన కుట్ర అని ఆయన ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సైతం ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించారని గుర్తు చేస్తూ..  డీఎంకే అనుసరిస్తున్న ద్రవిడ జాతీయత కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. హిందూ సమాజంలోని కుల వివక్షను సనాతన ధర్మానికి ఆపాదించడం తగదనీ, కుల వ్యవస్థ అనేది కాలక్రమేణా వచ్చిన ఒక సామాజిక వికృతి మాత్రమేనని, దానిని సరిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని   పేర్కొన్నారు.

మరోవైపు, డీఎంకే నాయకత్వంపై అన్నమలై వ్యక్తిగత విమర్శలకు   దిగారు. ఉదయనిధి స్టాలిన్ ఒక వైపు బహిరంగ వేదికలపై సనాతన ధర్మాన్ని విమర్శిస్తూనే..  మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు దేవాలయాలకు వెళ్లడం, హిందూ ఆచారాలను పాటించడంపై ఉన్న ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు.  ముందు మీ తల్లిని గుడికి వెళ్లకుండా ఆపండి..  ఆ తర్వాత సనాతన నిర్మూలన గురించి మాట్లాడండి  అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. డీఎంకే నేతలు వ్యక్తిగత జీవితంలో హిందూ విశ్వాసాలను గౌరవిస్తూ..  కేవలం ఓట్ల కోసం రాజకీయ వేదికలపై హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

 డీఎంకే తన సామాజిక న్యాయ పోరాటంలో భాగంగానే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతుండగా, బీజేపీ దీనిని హిందూ ధర్మంపై   దాడిగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. ద్రవిడ ఉద్యమ మూలాలు, పెరియార్ సిద్ధాంతాలు ఒకవైపు.. వేద కాలం నాటి సనాతన ధర్మ తత్వాలు మరోవైపు నిలబడి తలపడుతున్నాయి. ఈ ఘర్షణ కేవలం రెండు పార్టీల మధ్యే వైరుద్ధ్యమే కాకుండా, ఆధునిక రాజ్యాంగ విలువలు,  ప్రాచీన సంప్రదాయాల మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే చర్చను కూడా తెరపైకి తెచ్చింది.

ప్రస్తుతానికి ఈ వివాదం ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధాన్ని తలపిస్తోంది. వైరల్ అవుతున్న పాత వీడియోలు, అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి. ఒకప్పుడు నాస్తికవాదం, ద్రవిడ వాదం బలంగా ఉన్న తమిళనాట, ఇప్పుడు హిందూ ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చలు రాజకీయ పరిణతికి నిదర్శనమా లేక సామాజిక చీలికకు సంకేతమా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.  ఏది ఏమైనా, అన్నమలై,  ఉదయనిధి మధ్య సాగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

 సనాతన ధర్మాన్ని కేవలం 'నిర్మూలించాలి' లేదా 'రక్షించాలి' అనే   వాదనల మధ్య, దానిని సరిగ్గా  అర్థం చేసుకోవడం,  సంస్కరించుకోవడం అనే అంశాలపై ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అణచివేతను వ్యతిరేకించడం ఎంత ముఖ్యమో, ఒక నాగరికత మూలాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు వాదనల మధ్య ఒక మధ్యేమార్గాన్ని వెతకడమే ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి పరిష్కారం అవుతుంది. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...