ఉమెన్ వరల్డ్ కప్‌లో కడప స్పిన్నర్ సత్తా
posted on Nov 3, 2025 3:52PM

భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్‌కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా అందుకున్న ఈ స్పిన్నర్ భారత్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
కడపకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడేది. తర్వాత ఆమె మనసు క్రికెట్ వైపు మళ్లింది. ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ఆరంభించింది. అందులో సఫలం కాకపోవడంతో స్పిన్నర్‌గా మారింది. దేశవాళీలో స్థిరంగా రాణించింది. దీంతో గతేడాది డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఈ స్పిన్నర్‌ను రూ.55 లక్షలు పెట్టి దక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో సీనియర్ మహిళల టోర్నీలో భారత్-బికి ఆడి ఆకట్టుకుంది. కానీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఆమె ఊహించలేదు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం.. స్థిరంగా రాణిస్తుండడంతో భారత్ సీనియర్ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈ ఏప్రిల్‌లో శ్రీలంకపై అరంగేట్రం చేసింది.
ప్రపంచకప్ జట్టులో చోటు కోసం చాలామంది రేసులో ఉండడంతో కొత్త అమ్మాయి శ్రీచరణికి అవకాశం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అనుభవం కన్నా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ శ్రీచరణికి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఆమె లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ భారత్, శ్రీలంక పిచ్‌లపై ఎంతో కీలకమవుతుందని భావించారు. ఆ నమ్మకాన్ని ఈ స్పిన్నర్ వమ్ము చేయలేదు. అత్యధిక వికెట్లు పడగొట్టలేదు కానీ.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కీలకంగా మారింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఆ జట్టు మరింత ఎక్కువ స్కోరు చేయలేదంటే అందుకు శ్రీచరణియే కారణం. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన డీవై పాటిల్ పిచ్‌పై జోరు మీదున్న ఆసీస్ బౌలర్లను డెత్ ఓవర్లలో అడ్డుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు వేసే శ్రీచరణి.. వైవిధ్యంతో బోల్తా కొట్టిస్తుంది. బంతి వేగాన్ని తగ్గించడం, ఒక బంతిని స్పిన్ చేసి మరొక బంతిని నేరుగా వేయడం ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టింది. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో దీప్తిశర్మ తర్వాత శ్రీచరణియే ఉంది. ఆమె ఇప్పటిదాకా 17 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టింది. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసింది. చరణి ఇదే జోరు మున్ముందు కొనసాగిస్తే భారత్‌కు మరిన్ని విజయాలు అందించడం ఖాయం.