ఐఏఎస్, ఐపీఎస్.. ఎవ‌రు గొప్ప‌?

posted on: May 23, 2026 2:12PM

పశ్చిమ బెంగాల్‌లో 2013లో చోటుచేసుకున్న ఐపీఎస్ అధికారి కుట్టికట్ జయరామన్ అనే ఐపీఎస్ అధికారి, గొడల కిరణ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారుల కేసు  కేవలం ఇద్దరు అధికారుల మధ్య జరిగిన విభేదం కాదు.. రాష్ట్ర పరిపాలనా సంస్కృతి, అవినీతి దర్యాప్తుల స్వాతంత్రానికి సంబంధించిన విష‌యం కూడా. ఐఏఎస్, ఐపీఎస్ సంబంధాల వ్య‌వ‌హారాన్ని కూడా వెలుగులోకి తెచ్చిన సంఘటనగా నిలిచింది.  సిలిగురి పోలీస్ కమిషనర్‌గా ఉన్న జయరామన్, సిలిగురి, జల్పాయ్ గురి డెవలప్‌మెంట్ అథారిటీ- ఎస్జేడీే లో జరిగిన భారీ ఆర్థిక అక్రమాల కేసులో మాల్దా జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి జి. కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, కొద్ది గంటల్లోనే ఆయనను పదవి నుంచి తొలగించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  

సిలిగురి, జల్పాయ్‌గురి డెవలప్‌మెంట్ అథారిటీ కేసు..పశ్చిమ బెంగాల్‌లో స్థానిక అభివృద్ధి సంస్థల పారదర్శకతపై ప‌లు ప్రశ్నల‌ను లేవనెత్తింది. ఎస్జెడిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా.. 2011 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి  వరకు పనిచేసిన సమయంలో, జి. కిరణ్ కుమార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. మొత్తం రూ. 200 కోట్ల అవినీతి కేసులో, సుమారు రూ. 80 కోట్ల వరకు నిధులు అక్రమంగా మళ్లించబడ్డాయని తేల్చాయి దర్యాప్తు సంస్థలు. 

మూడు ఎలక్ట్రిక్ శ్మశానాల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులో, పనులు పూర్తిగా ప్రారంభం కాకముందే రూ. 51 కోట్ల పూర్తి చెల్లింపులు జరిగాయని, చెబుతున్నాయి ప‌లు మీడియా రిపోర్టులు.  అభివృద్ధి పేరిట విడుదలైన నిధులు, ప్రాజెక్టులు పూర్తి కాకముందే,  SJDA కేసు, స్థానిక అభివృద్ధి సంస్థల ఆర్థిక నియంత్రణపై ప‌లు సందేహాల‌ను రేకెత్తించింది. 
 
ఒకవైపు అవినీతి ఆరోపణలపై అరెస్ట్, మరోవైపు ఆ అరెస్ట్ ఆదేశించిన పోలీస్ కమిషనర్‌కు వెంటనే బదిలీ..  ఇందువ‌ల్ల తెలిసిన అధికారిక  నీతి ఏంట‌ని చూస్తే 2013 నవంబర్ 30న, సిలిగురి పోలీస్ కమిషనర్ జయరామన్ ఆదేశాల మేరకు, మాల్దా జిల్లా మేజిస్ట్రేట్ కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై బీఎన్ఎస్, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.  అరెస్ట్ జరిగిన కొన్ని గంటల్లోనే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జయరామన్‌ను సిలిగురి పోలీస్ కమిషనర్ పదవి నుంచి తొలగించి, కంప‌ల్స‌రీ వెయిటింగ్ లో ఉంచింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ మిత్రా, ఈ అరెస్ట్‌ను హైలీ ఎంబ‌రాసింగ్ గా పేర్కొంటూ, జయరామన్  తన పరిధిని దాటి వ్యవహరించార‌ని  కామెంట్ చేశారు. జయరామన్ మాత్రం,  తాను ప్రజాహితం కోసం పని చేశాన‌నీ.. చేసిన పనిపై ఎలాంటి పశ్చాత్తాపం లేదంటూ  తన చర్యల‌ను సమర్థించుకున్నారు.  అవినీతి ఆరోపణలున్న అధికారిని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారికి పోస్టింగ్ లేకుండా పోవ‌డం, అరెస్ట్ అయిన అధికారి ఒక రోజులో బెయిల్‌పై బయట ఉండ‌టం అనే, ఈ వ్యత్యాసం పరిపాలనా న్యాయంపై పెద్ద చర్చకు దారి తీసింది. 

ఈ కేసు, ఐఏఎస్, ఐపీఎస్ మధ్య ఉన్న అధికార స‌మీక‌ర‌ణాలపైనా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. భారత పరిపాలనా వ్యవస్థలో ఐఏఎస్, ఐపీఎస్ రెండు ఆల్ ఇండియా సర్వీసులు అయినప్పటికీ, రాష్ట్ర పరిపాలనలో నిర్ణయాధికారం, రాజకీయ ప్ర‌భావాలు.. పోస్టింగ్‌ల విషయంలో ఐఏఎస్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విమర్శలు చాలాకాలంగానే ఉన్నాయి.  జయరామన్ బదిలీ, కిరణ్ కుమార్‌కు వెంట‌నే బెయిల్ రావ‌డం, అరెస్ట్‌పై ప్రభుత్వ అసంతృప్తి  కలిపి చూస్తే..  ఈ కేసులో ఐఏఎస్ అధికారిని రక్షించడానికి ఐపీఎస్ అధికారిని బలిచేస్తారా? అనే ప్రశ్నల‌ను తెర‌పైకి తెచ్చాయి. సీపీఎం , కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలు, జయరామన్‌ను నిజాయితీ గల అధికారిగా అభివర్ణిస్తూ, ఆయన తొలగింపును  అన్యాయంగా, పోలీస్ మోరల్‌కు విఘాతంగా విమర్శించాయి.  ఒక కేసులో ఐఏఎస్, ఐపీఎస్ ఇద్దరూ ఆరోపణలపై దర్యాప్తు ప‌రిధిలో ఉన్నా, పరిపాలనా వ్యవస్థ వారిని ఎలా వేర్వేరు ప్రమాణాలతో చూసింది? అనే ప్రశ్న ఈ సంఘటనతో మరింత పెరిగింది.

ఈ కేసు, మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతి వ్యతిరేక వైఖరి, అధికారుల స్వతంత్ర దర్యాప్తు హక్కులపై   ప్రశ్నలు లేవనెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున,  ఇంత పెద్ద స్థాయి అరెస్ట్‌కు ముందు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి,  లేదా కనీసం సమాచారం ఇవ్వాలి. అది జరగలేదనే వాదనను తెర‌పైకి తెచ్చారు ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు.  

విమర్శకుల దృష్టిలో, అవినీతి ఆరోపణలున్న అధికారిపై చర్య తీసుకున్న పోలీస్ అధికారి వెంటనే బదిలీ కావడం,  త‌ప్పుడు సంకేతాల‌ను ఇచ్చింది. అవినీతి దర్యాప్తు చేయాలనుకునే అధికారులకు ఇది ఒక హెచ్చరికగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  అదే సమయంలో, ప్రభుత్వం కేసు కొనసాగుతుంది, దర్యాప్తు ఆగదు అని స్పష్టం చేసినప్పటికీ..  ప్రజాభిప్రాయంలో ప్రధానంగా నిలిచింది. అరెస్ట్ చేసినవాడే శిక్షకు గురయ్యాడ‌నే భావ‌న వెలుగులోకి తెచ్చింది.  అవినీతి వ్యతిరేక పోరాటం నిజ‌మైన స్వేచ్ఛ‌తో నడుస్తుందా? లేక రాజకీయ పరిపాలనా విధానాన్ని నిర్ణయిస్తుందా? అనే ప్రశ్నకు ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.

ఒకప్పుడు కంపల్స‌రీ  వెయిటింగ్ లో ఉన్న అధికారి, ఇప్పుడు సంస్థాగత అవినీతి దర్యాప్తు కమిషన్‌లో కీలక బాధ్యతలు చేప‌ట్ట‌డం.. ఇది పరిపాలనా దృక్కోణంలో ఒక పెద్ద చక్రం తిరిగినట్లే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంలో..  జయరామన్‌ను మళ్లీ కీలక బాధ్యతలతో రంగప్రవేశం చేయించినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో జరిగిన సంస్థాగత అవినీతి కేసులను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక కమిషన్‌లో ఆయనను నియమించడం, గతంలో శిక్షకు గురైన అధికారి, ఇప్పుడు అవినీతి దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్నారనే సందేశాన్నిస్తోంది.

ఇది, పశ్చిమ బెంగాల్ పరిపాలనలో అవినీతి దర్యాప్తు స్వేచ్ఛ‌ పై కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. ప్రత్యేకించి, గత దశాబ్దంలో వెలుగులోకి వచ్చిన పలు కుంభకోణాలైన చిట్‌ఫండ్, నియామక, స్థానిక అభివృద్ధి నిధులు మొదలైన వాటిలాగా ఇది కూడా ఒక‌టిగా  నిలుస్తోంది.   ఒకే అధికారి, రెండు భిన్నమైన‌ రాజకీయ ప్ర‌భావిత వ్య‌వ‌హారంలో భాగంగా.. ఒకసారి బదిలీ, మరోసారి బాధ్యత చేప‌ట్ట‌డం.. ఇది కేవలం వ్యక్తిగత వ్య‌వ‌హారం కాదు. అడ్మినిస్ట్రేష‌న‌ల్ క‌ల్చ‌ర్లో.. వ‌చ్చిన‌ మార్పున‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కూడా. కుట్టికట్ జయరామన్ వ‌ర్సెస్ గొడల కిరణ్ కుమార్ కేసు, పశ్చిమ బెంగాల్ పరిపాలనలో మూడు ప్రధాన ప్రశ్నలను వెలుగులోకి తెచ్చింది.

అందులో మొద‌టిది..  అవినీతి దర్యాప్తు స్వేచ్ఛ‌కు సంబంధించిన‌ది కాగా.. దర్యాప్తు సంస్థలు, పోలీస్ అధికారులు రాజకీయ, పరిపాలనా ఒత్తిడుల నుంచి ఎంత మేర‌కు స్వతంత్రంగా పని చేయగలరు? అన్న‌ది కాగా.. రెండోది..  ఐఏఎస్, ఐపీఎస్ ల అధికార‌ సమీకరణం.. రెండు ఆల్ ఇండియా సర్వీసెస్ మధ్య సమాన గౌరవం, సమాన బాధ్యత, సమాన రక్షణ.. గ్రౌండ్ లెవ‌ల్లో ఎంతవరకు అమలవుతోంది? అన్న‌ది  కాగా, మూడోది.. రాజకీయ మార్పు, పరిపాలనా  పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు చెందిన అంశం.

ఒకానొక రాజకీయ దశలో వివాదాస్పదంగా నిలిచిన అధికారి, మరో దశలో నిజాయితీ ప్రతీకగా.. తిరిగి రంగప్రవేశం చేయడం.. ఇది పరిపాలనా న్యాయానికి సంకేతమా, లేక రాజకీయ సమీకరణాల ప్ర‌భావ‌మా? అన్న మీమాంశ‌కు తెర‌లేచింది.  ఓవ‌రాల్ గా చూస్తే ఈ కేసు, ఒక ఐపీఎస్ అధికారి వ్యక్తిగతం మాత్రమే కాదు.. భారత పరిపాలనా వ్యవస్థలో అవినీతి దర్యాప్తు, అధికారుల స్వేచ్ఛ‌, రాజకీయ–పరిపాలనా సమీకరణంపై ఒక మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలింది. ఈ ప్రశ్నకు సమాధానం, కేవలం కోర్టుల తీర్పుల్లో మాత్ర‌మే కాదు.. భవిష్యత్తులోనూ అవినీతి కేసులను ఎలా హ్యాండిల్ చేస్తార‌నే  అంశ‌మూ ఇందులో దాగి ఉంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...