ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి

posted on: Dec 28, 2025 11:51AM

 

ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు. 

డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు.
గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...