హైదరాబాద్‌లో హైడ్రా ఉక్కుపాదం
posted on: Jan 30, 2026 2:42PM

హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా అప్రమత్తమైన హైడ్రా అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై దృష్టి కేంద్రీకరించారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పలు ఫర్నిచర్ షోరూమ్‌లు, గోడౌన్‌లపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు.
రాయల్ ఓక్ షోరూమ్ సీజ్
కూకట్‌పల్లిలోని ప్రముఖ రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా పాటించకపోవడంతో అధికారులు షోరూమ్‌ను సీజ్ చేశారు. షోరూమ్ భవనంలో అగ్నిమాపక పరికరాలు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు అవసరమైన మార్గాలు కూడా సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు.
అదేవిధంగా పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్‌ను అక్రమంగా ఫర్నిచర్ గోడౌన్‌గా మార్చి, భారీ మొత్తంలో ఫర్నిచర్‌ను నిల్వ చేసినట్లు తనిఖీల్లో తేలింది. సెల్లార్‌లో తగిన వెంటిలేషన్ లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా దహనశీల పదార్థాలను నిల్వ చేయడం వల్ల అగ్నిప్రమాదం జరిగితే భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాజేంద్రనగర్‌లో కొనసాగుతున్న దాడులు
రాజేంద్రనగర్ పరిధిలోనూ హైడ్రా అధికారులు ఫర్నిచర్ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని రాయల్ ఓక్స్ ఫర్నిచర్ బిల్డింగ్‌తో పాటు పక్కనే ఉన్న మరో ఫర్నిచర్ దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. అడ్డదిడ్డంగా కొత్త ఫర్నిచర్‌ను షాపుల్లో నింపివేయడం, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా వ్యాపారాలు నిర్వహించడం తీవ్రంగా తప్పని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైర్ సేఫ్టీ లేని వ్యాపారాలపై సీరియస్
తనిఖీల సందర్భంగా చాలా ఫర్నిచర్ షాపుల్లో కనీస స్థాయి ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు కూడా అమలు కావడం లేదని అధికారులు వెల్లడించారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు పనిచేయని స్థితిలో ఉండటం, అలారం వ్యవస్థలు లేకపోవడం, అత్యవసర ద్వారాలు మూసివేయడం వంటి లోపాలు కనిపించాయని తెలిపారు. ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యాపార యజమానులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నగరవ్యాప్తంగా తనిఖీలు మరింత విస్తృతంగా చేపడతామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపులు, కమర్షియల్ భవనాలపై సీజ్ చర్యలు కొనసాగుతాయని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నగరంలో ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా చేపడుతున్న ఈ చర్యలతో ఫర్నిచర్ షాపుల యజమానుల్లో కలవరం నెలకొనగా, సామాన్య ప్రజలు మాత్రం హైడ్రా చర్యలను హర్షం వ్యక్తం చేస్తున్నారు.






