నార్సింగిలో హైడ్రా ఉక్కుపాదం

posted on: May 30, 2026 10:27AM

 

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో హైడ్రా అధికారులు మరోసారి తమ దూకుడును ప్రదర్శించారు. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి శనివారం ఉదయం ముష్కి చెరువుపై ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు.

అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కి చెరువులో దాదాపు 10 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు, వాటి తొలగింపునకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిన స్కైలా అపార్ట్‌మెంట్‌కు చెందిన కాంపౌండ్‌ వాల్‌ను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ చర్యతో ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, చెరువులో మిగిలిన సుమారు 50 ఎకరాల భూభాగాన్ని భవిష్యత్తులో కబ్జాల బారిన పడకుండా రక్షించేందుకు శాశ్వత కంచె ఏర్పాటు పనులను కూడా అధికారులు ప్రారంభించారు.

చెరువుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు ఎంత పెద్దవైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చెరువు పరిసర ప్రాంతాల్లోని విల్లాలు, భవనాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడిసెలను వెంటనే తొలగించాలని సూచించారు.

ముష్కి చెరువు ఆక్రమణలపై చేపట్టిన ఈ చర్యలు నగర పరిధిలోని ఇతర చెరువుల వద్ద కూడా కొనసాగనున్నాయని హైడ్రా అధికారులు వెల్లడించారు. చెరువుల రక్షణ కోసం రానున్న రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...