ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణంపై హైడ్రా కూల్చివేతలు

posted on: Apr 17, 2026 7:11PM

 

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి. కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో నిర్మించబడిన జీ ప్లస్–5 భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణంగా గుర్తించిన ఈ భవనాన్ని గత కొన్ని రోజులుగా దశలవారీగా కూల్చివేస్తూ వచ్చిన హైడ్రా సిబ్బంది, గురువారం నాటికి నిర్మాణాన్ని పూర్తిగా తొలగించినట్లు తెలిపారు. ఈ కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికంగా నివసిస్తున్న ప్రజల్లో ఉద్రిక్తత నెలకొంది.

కూల్చివేత సమయంలో సమీపంలోని ఇళ్లకు చెందిన డ్రైనేజీ లైన్లు, పైప్ లైన్లు, ప్రహరీ గోడలు దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపించారు. తమ ఆస్తులకు నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...