అక్రమ కట్టడాల కూల్చివేత
posted on Nov 18, 2025 8:56AM

శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు అక్రమ కట్టడాలను హైడ్రా సోమవారం (నవంబర్ 17) కూల్చివేసింది. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో రహదారులు, పార్కులను పట్టించుకోకుండా.. చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైడ్రా ఈ కూల్చివేతలకు పాల్పడింది. 40 ఫీట్ల రహదారిపై అడ్డంగా ఐరన్ ఫ్రేమ్‌తో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని తొలగించి రహదారిని క్లీయర్ చేసింది. అలాగే 40 ఫీట్ల రహదారిని పట్టించుకోకుండా.. నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొలగించింది.
మరో చోట 40 ఫీట్ రహదారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొలగించి.. మార్గం సుగమం చేసింది. 40 ఫీట్ల రహదారిని కలిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్‌ను కూడా పాక్షికంగా తొలగించింది. రెండు చోట్ల 25 ఫీట్ల రహదారులపై ఏర్పాటు చేసిన 40 వరకూ ఉన్న ఫుడ్ కంటైనర్లతో పాటు చైనా ఫుడ్ కోర్టులను తొలగించి మార్గాలను క్లియర్ చేసింది. 40 ఫీట్ల రహదారిపైకి జరిగి నిర్మించిన ఆసుపత్రి భవనం సెల్లార్ ర్యాంపులను హైడ్రా తొలగించింది. ఇలా మొత్తమ్మీద 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను తొలగించింది. రహదారుల హద్దులను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు లే ఔట్‌లోని రహదారులను హైడ్రా పునరుద్ధరించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు.