హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీపై హైడ్రా ఆకస్మిక తనిఖీలు
posted on: Jan 29, 2026 3:18PM

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై హైడ్రా దృష్టి సారించింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ప్రారంభించగా, నిబంధనలను లెక్కచేయకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలుచోట్ల షోరూమ్‌లు, వాణిజ్య భవనాలపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–36లోని నీరూస్ వస్త్రాల షోరూమ్‌ను హైడ్రా అధికారులు సీజ్ చేశారు.
అనుమతులులేకుండా రూఫ్ షెడ్ నిర్మించడంతో పాటు, షోరూమ్‌ను గోదాములా మార్చి భారీగా వస్త్రాలను నిల్వ చేయడం అధికారుల దృష్టికి వచ్చింది. ఫైర్ ఎన్‌వోసీ లేకపోవడం, అగ్నిమాపక యంత్రంసరిగా లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు గుర్తించడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. షోరూమ్ ప్రాంగణంలో “ఫైర్ అన్‌సేఫ్ షాప్” అనే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా షాపులను గోదాములుగా మార్చడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ భారీ ఫర్నీచర్ షోరూమ్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. ఆరు అంతస్తుల భవనంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫర్నీచర్ నిల్వలు ఉండటం, మెట్ల మార్గాలను సైతం స్టాక్‌తో మూసివేయడం గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా అడ్డుపడేలా ఉండటంతో అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్‌వోసీ లేకపోవడం, అగ్నిమాపక యంత్రం అందు బాటులో లేకపోవడంతో షోరూమ్‌కు తాళం వేసి వ్యాపార లావాదేవీలను నిలిపివేయడమే కాకుండా విద్యుత్ సరఫరాను కూడా నిలిపేశారు.
ఇటీవల ఇదే ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత కూడా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో హైడ్రా, ఫైర్ సర్వీసెస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాల అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. నగరంలో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఫైర్ నిబంధనల ఉల్లంఘ నలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేం దుకు హైడ్రా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు లేదా కమిషనర్‌కు నేరుగా 7207923085 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు పంపవచ్చని అధికారులు సూచించారు. అదేవిధంగా Commissioner_HYDRAA ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. షాపులు, షోరూమ్‌లను గోదాములుగా మార్చి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతా యని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం వ్యక్తం చేశారు.






