Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్.. సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు.!
posted on: Aug 13, 2026 9:29AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు స్టే అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల డిమోలిషన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. మల్కాజిగిరి మండలంలో ఉన్న వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాల విషయంలో గతంలోనే న్యాయస్థానం స్టే మంజూరు చేసింది. అయినప్పటికీ.. ఆ స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. కూల్చివేతలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ధర్మాసనం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి మండలాల తహసీల్దార్లు కోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కీలక విషయాలను న్యాయస్థానానికి వివరించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు, ఉత్తర్వులు ఇవ్వలేదనీ, తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు.
దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ అందించిన ప్రాథమిక సమాచారం, జీఎల్ఆర్ సూచనల మేరకే చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. క్షేత్రస్థాయి రికార్డులను, న్యాయపరమైన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదనీ పేర్కొంది. ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించిన హై కోర్టు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అమల్లో ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల సమగ్ర వివరాలను తక్షణమే హైడ్రా యంత్రాంగానికి లేఖ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. అలాగే హైడ్రా కమిషనర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ..ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
HYDRA Commissioner Ranganath, Telangana High Court, Contempt of court notices, Illegal demolitions, Medchal Collector report






