మల్టీలెవెల్ పార్కింగ్ సెంటర్లతో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్!

posted on: May 9, 2026 4:57PM

హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాహనాల రద్దీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం  భారీ ప్రణాళికను రూపొందించింది. భాగ్యనగరాన్ని ట్రాఫిక్ రహితంగా నగరంగా  తీర్చిదిద్దే లక్ష్యంతో..  అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్  కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించింది. వాహనదారులు రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల ఏర్పడుతున్న అంతరాయాలను తొలగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం

నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు,  ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు  శాశ్వత  పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో  పీపీపీ పద్ధతిలో  ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 

ప్రభుత్వ ఆలోచన ప్రకారం..  ఈ మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలలో కేవలం వాహనాల నిలుపుదలకే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలకు కూడా అవకాశం కల్పించడంద్వారా  ఈ ప్రాజెక్టులు ఆర్థికంగా కూడా లాభసాటిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్, సెన్సార్ల వినియోగం వంటి ఆధునిక సాంకేతికతను ఇందులో ప్రవేశపెట్టడం ద్వారా వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. 

గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ..  ఈసారి మరింత పకడ్బందీగా మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను నగరమంతటా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా ఓల్డ్ సిటీ,  అబిడ్స్, కోఠి, పంజాగుట్ట వంటి రద్దీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించడంతో పాటు..  రోడ్ల విస్తరణ పనులను కూడా ఈ ప్రణాళికలో భాగంగా సమన్వయం చేయనుంది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను సొంతం చేసుకుంటుందని నిపుణులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...