హైదరాబాద్‌లో మళ్లీ ఇంధన కష్టాలు...పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు!

posted on: Apr 27, 2026 2:40PM

 

హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది. రాజధానిలోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ ఇంధన కొరత, ఇప్పుడు నేరుగా తెలంగాణ రాజధానిని తాకడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

నగరంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ కంటే డీజిల్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థపై ఆధారపడిన భారీ వాహనదారులు, వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ కోసం వెతికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం దొరకదేమోనన్న భయంతో పలువురు వాహనదారులు బంకుల వద్ద ప్యానిక్ బయింగ్‌కు దిగుతున్నారు.

కొన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండటంతో, అక్కడ వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. అత్యవసరంగా ఇంధనం అవసరమైన వారు డబ్బాలు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్‌ను తరలించుకుపోవడం కూడా కనిపిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అయితే ఏపీ నుంచి వచ్చే వాహనదారులు కూడా ఇంధనం కోసం ఇక్కడి బంకులపైనే ఆధారపడుతుండటంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది.

ఈ పరిస్థితులపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. చమురు కంపెనీలు సకాలంలో సరఫరా చేయడం లేదని, అడ్వాన్స్ పేమెంట్ చేసినా ట్యాంకర్లు సకాలంలో బంకులకు చేరడం లేదని ఆయన వెల్లడించారు. కావాలనే సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా ఇంధన ధరలను పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సమాచారం. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు కంపెనీలు తమ రిటైల్ అవుట్‌లెట్లకు సరఫరాను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వాహనదారులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంధన కష్టాలు ఎప్పటికి తీరుతాయోనని సామాన్యులు వేచి చూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...