హైదరాబాద్ ORRపై లగ్జరీ స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు.. తండ్రిపై కేసు

posted on: Jun 19, 2026 12:53PM

 

హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై అత్యంత ఖరీదైన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కేవలం 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో వేగంగా దూసుకెళ్తున్న కారుకు బాలుడు స్టీరింగ్ పట్టుకుని ఉండగా, అతడి పక్కనే తండ్రి ప్రశాంతంగా కూర్చొని ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ దృశ్యాలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. చిన్నారి చేతిలో లగ్జరీ స్పోర్ట్స్ కారు స్టీరింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ వీడియో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరడంతో వారు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మైనర్‌కు వాహనం నడిపేందుకు అనుమతించినందుకు బాలుడి తండ్రిపై కేసు నమోదు చేశారు.

మైనర్ల చేత వాహనాలు నడిపించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి నిర్లక్ష్య చర్యలు తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

“కొన్ని క్షణాల సరదా కోసం చేసిన నిర్లక్ష్యం అనేక మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవచ్చు” అని హెచ్చరించిన పోలీసులు, మైనర్లకు వాహనాలు అప్పగించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కంటే రోడ్డు భద్రత ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...