Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఔటర్ రింగురోడ్డుపై ప్రేమజంటల ప్రమాదకర బైక్ స్టంట్స్
posted on: Apr 14, 2026 9:24PM

భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు. అత్యంత భద్రత కలిగిన ఈ రహదారిపై ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషిద్ధమని తెలిసినా, ప్రేమజంటలు బరితెగించి బైక్ రైడింగ్‌కు దిగారు. తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సోమవారం రాత్రి వేళ పోలీస్ అకాడమీ వైపు నుండి పుప్పాలగూడ (నానక్‌రాంగూడ) టోల్ గేట్ వైపు రెండు జంటలు ద్విచక్ర వాహనాలపై యథేచ్ఛగా ప్రయాణించాయి. ఈ క్రమంలో వారు వాహనాలపై విన్యాసాలు చేస్తూ ఇతర ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. ఈ దృశ్యాలను అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా "దమ్ముంటే పట్టుకోరా షెకావత్" అనే రీతిలో పోలీసులకే సవాల్ విసిరేలా కామెంట్లు రావడంతో అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. వంద కిలోమీటర్ల పైచిలుకు వేగంతో కార్లు, భారీ వాహనాలు ప్రయాణించే ఓఆర్‌ఆర్‌పై ఇలా టూవీలర్లతో ప్రవేశించడం ఆత్మహత్య సదృశ్యమని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఘటనపై స్పందించిన నార్సింగి ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆయా వాహనాల నంబర్లను గుర్తించినట్లు సమాచారం. నిబంధనలను అతిక్రమించి రహదారి భద్రతకు విఘాతం కలిగించిన సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, లైసెన్సుల రద్దు దిశగా కూడా ఆలోచిస్తున్నారు.
అయితే, ఈ ఘటనలో భద్రతా లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు టూవీలర్లకు అనుమతి లేని ఓఆర్‌ఆర్‌పైకి వారు ఎలా ప్రవేశించగలిగారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎంట్రీ పాయింట్ల వద్ద ఉండే టోల్ గేట్ సిబ్బంది ఏమరపాటుగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన టోల్ గేట్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
సాధారణంగా ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంది. గతంలోనూ ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద నిఘా పెంచాలని, అక్రమంగా ప్రవేశించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వాహనదారులు కోరుతున్నారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవే పెట్రోలింగ్ బృందాలను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, సీసీటీవీ కెమెరాల నిఘా ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు.



.webp)


