Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేదరికానికి "కరెన్సీ"తో ఎర..
posted on: Jul 4, 2016 1:08PM

కళ్ల నిండా అమాయకత్వం..దైవత్వాన్ని గుర్తుకు తెచ్చేలా ఒంటి నిండా తెల్లని వస్త్రం, ఆ చూపులు, ఆహార్యం చూస్తోంటే చేతులెత్తి మొక్కాలనిపిస్తోందా..ఇది పాతబస్తీలో తిరుగాడే అరబ్ షేక్‌ల శైలి. పాతబస్తీలోని నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలతో అరబ్ షేక్‌లు చెలగాటమాడుతున్నారు. ఎక్కడో సుదూరాల నుంచి ఇక్కడికి వస్తారు..మైనర్ లేదు మేజర్ లేదు కంటికి ఇంపుగా కన్పిస్తే చాలు కరెన్సీ కట్టలతో పేదరికానికి ఎర వేస్తారు. అనంతరం నిఖా చేసుకుని వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. డైలీ ఇలాంటి మోసాలు పాతబస్తీలో ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తునే ఉన్నాయి.
పాత నగరంలోని నిరక్షరాస్యత, బహు సంతానం కారణంగా పేద ముస్లిం కుటుంబాలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. రోజు వారీ వృత్తిపై వచ్చే ఆదాయం, ఖర్చులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దానితో కుటుంబాన్నే పోషించలేకపోతుంటే..గుండెల మీద కుంపటిలా అమ్మాయిల పెళ్లిళ్లు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు నిస్సాహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలక్‌నూమా, బార్కాస్, సలాల, తలాబ్‌కట్టా, భవానీనగర్, అమన్‌నగర్, తీగలకుంట, జహనుమా, తాడ్‌బన్ తదితర ప్రాంతాల్లో నిరుపేదలు అత్యధికంగా నివసిస్తున్నారు. దీంతో అరబ్‌షేక్‌లు ఇలాంటి కుటుంబాలను టార్గెట్ చేసుకుని డబ్బు ఎరగా వేస్తున్నారు. నిఖా జరగ్గానే దుబాయ్ తీసుకువెళతానని కల్లబొల్లి మాటలు చెప్పి వారిని ముగ్గులోకి దించుతారు. ఇందుకుగాను కుటుంబపెద్దకు అంతో..ఇంతో ముట్టజెప్పడంతో వారు అమాంతం కరిగిపోయి తమ బిడ్డలను కట్టుబట్టలతో సహా షేక్‌ల చేతిలో పెడుతున్నారు.
అలా నిఖా చేసుకున్న షేక్‌లు కొద్ది రోజులు అమ్మాయిలతో కాపురం చేసి అనంతరం ఖాజీల సమక్షంలో తలాక్..తలాక్..తలాక్ అనే మూడు మాటలు చెప్పి ఎంచక్కా తమ దేశాలకు ఎగిరిపోతున్నారు. అలా వెళ్లిపోయిన మొగుడు తిరిగివస్తాడని ఆ అమాయక మహిళలు కళ్లల్లో వత్తులేసుకుని జీవితాంతం నిరీక్షిస్తున్నారు. మరి కొందరి విషయాల్లో షేక్‌లు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మోజు తీరింది అనిపించగానే అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అప్పగించడమో లేక తమతో పాటు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడమో చేస్తున్నారు . ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక రాజకీయ నాయకులు, ఖాజీలు, బ్రోకర్ల సాయంతో అరబ్ షేక్‌ల పెళ్లిళ్ల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.






