చల్లబడ్డ భాగ్యనగరం

posted on: May 27, 2026 11:16AM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరవాసులకు ఎట్టకేలకు తీవ్రమైన ఎండల నుండి   ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది. అర్థరాత్రి వేళ  ఉరుములు, మెరుపుల బీభత్సంతో కూడిన వాన దంచికొట్టింది. ముఖ్యంగా తూర్పు హైదరాబాద్ పరిధిలోని కాప్రా, అల్వాల్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ,  ఎల్బీ నగర్, మలక్‌పేట్, హయాత్‌నగర్ వరకు గల పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో సతమతమైన జనాలు, రాత్రికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో  సేదతీరారు.  అయితే ఈ  వర్షం కేవలం చల్లదనాన్నే కాకుండా ప్రమాదకర హెచ్చరికలను కూడా మోసుకొచ్చింది.

 మేడ్చల్, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బాచుపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, సుచిత్ర,  శేరిలింగంపల్లి ప్రాంతాలలో  బుధవారం (మే 27)  ఉరుములు,  మెరుపులతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  కాగా వాతావరణశాఖ హెచ్చరికతో  జీహెచ్ఎంసీ  అప్రమత్తమైంది.  గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల రోడ్లపై చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...