వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడిందనే చంపేశాడా..?

posted on: Jul 5, 2016 5:58PM

రూపేశ్ కుమార్ అనే షేర్ బ్రోకర్ భార్యను అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెట్రోలు పోసి తగులబెట్టి తప్పించుకుంటూ దొరికిపోయిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. అతన్ని విచారించిన పోలీసులు హత్య చేయడానికి గల కారణాలను రాబట్టారు. తొలుత ఆర్థిక ఇబ్బందుల కారణంగానే భార్యను హత్య చేసినట్టు భావించినప్పటికీ..విచారణలో అది నిజం కాదని తేలింది. రూపేశ్ ఎనిమిదేళ్లక్రితం దక్షిణాఫ్రికాకు చెందిన సింథియా అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి సానియా అనే పాప పుట్టింది. అంతవరకు బాగానే ఉన్న వీరి కాపురంలో "ఫేస్‌బుక్" నిప్పులు పోసింది.

 

ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెంచ్ యువకుడితో సింథియాకు ఏర్పడిని పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ యువకుడితో ఆమె పెళ్లికి కూడా సిద్ధపడింది. తాను ఫ్రాన్స్‌కి వెళతానని..తనతో పాటు పాపను కూడా తీసుకెళ్తానని భర్త రూపేశ్‌తో చెప్పింది. వెళ్తే నువ్వు ఒక్క దానివే వెళ్లు కానీ పాపను మాత్రం ఇచ్చేది లేదని రూపేశ్ తేల్చి చెప్పాడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మొన్న రాత్రి ఇరువురి మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారి తీసింది. ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడంతో సింథియాను గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగులో ఉంచాడు. కూతురికి అనుమానం రాకుండా పాఠశాలలో విడిచిపెట్టాడు.

 

సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురు సానియాతో కలిసి శంషాబాద్ సమీపంలోని మదన్‌పల్లికి రాత్రి ఏడు గంటల ప్రాంతంలో వెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో  కూతురును మందు దించేసి ముందుకెళ్లాడు. బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి జారుకునే క్రమంలో కారును వేగంగా పరుగులు పెట్టించాడు. మదన్‌పల్లి శివారులోకి రాగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది. ఎంత సేపటికి బురదలోంచి కారు టైరు రాకపోవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు సాయం చేయాలని వచ్చారు. వారిని చూసి కంగారు పడటంతో పాటు దూరంగా మంటలు కనిపించడంతో అనుమానమొచ్చిన స్థానికులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వారు వచ్చి రూపేశ్‌ను పీఎస్‌కు తరలించడం చకచకా జరిగిపోయాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...