మెట్రో స్టేషన్ లో ఊరికే తిరుగుతున్నారా..? పైసల్ మాయం...!
posted on: Nov 30, 2017 10:13AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన హైదరాబాద్ మెట్రో రానే వచ్చేసింది. నిన్ననే ప్రారంభమైన మెట్రోలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేయాలా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు ఎలా ఉందో చూడటానికే చాలా మంది నిన్న మెట్రోలో ప్రయాణించారని చెప్పొచ్చు. స్టేషన్‌కు చేరుకున్న వెంటనే మొత్తం కలియదిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే...చేతిలో స్మార్ట్ కార్డ్ ఉంది కదా.. ఎంతసేపైనా స్టేషన్ లో ఉండొచ్చు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే... ఎందుకంటే.. దానివల్ల స్మార్ట్‌కార్డులోని సొమ్మంతా స్వాహా అయిపోతుంది. మాములుగా అయితే స్మార్ట్ కార్ట్ కోసం 200 రూపాయలు చెల్లిస్తే.. అందులో 100 రూపాయలు మనం వాడుకోవచ్చు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది.
ఓ ప్రయాణికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌కు మెట్రో ఎక్కాలన్నా ఉత్సాహంతో ఎక్కాడు.. అక్కడ అంతా చూశాడు.. బయటకు వచ్చాడు. అయితే తిరిగి ఇలా బయటకు వచ్చే ముందు చూసుకుంటే కార్డులో మిగిలింది కేవలం పన్నెండు రూపాయలే. రూ.88 మాయమవడంతో శ్రీనివాస్ అవాక్కయ్యాడు. దీంతో అసలు విషయం అర్ధమైంది.. అంటే స్టేషన్ లో ఎక్కువసేపు గడిపితే స్మార్ట్ కార్ట్ లోని పైసలు మొత్తం గల్లంతు అవ్వడమే అని. సో స్టేషన్‌లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఇదే కాకుండా మెట్రో ఛార్జీలు కూడా భారీగా ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు దీనికి ఉదాహరణగా కొన్ని లెక్కలు కూడా వేసి చెబుతున్నారు. ఆ లెక్కలేంటో మీరు చూడండి...
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మధ్య దూరం 575 కిలోమీటర్లు. ముందుగా కానీ విమాన టికెట్ బుక్ చేసుకుంటే రూ.1400 నుంచి రూ.1800 మధ్యన ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కను.. మెట్రో ఛార్జీలతో చూస్తే... హైదరాబాద్ మెట్రోలో 30 కిలోమీటర్ల జర్నీకి వసూలు చేస్తున్న ఛార్జీ రూ.60. ఈ లెక్కన 575 కిలోమీటర్లకు.. 30 కిలోమీటర్ల చొప్పునచార్జీ లెక్కేస్తే వచ్చే మొత్తం రూ.1150. అంటే.. కాస్త ముందుగా బుక్ చేసుకునే ఫ్లైట్ టికెట్ కు దగ్గరగా అన్నమాట. ఆ లెక్కల మాట సంగతేమో కానీ.. ఓ రకంగా చూస్తే మెట్రో ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇలానే ఉంటే... మెట్రో జర్నీ కూడా సామాన్యులకు కాకుండా పోయే ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వ దీనిపై కాస్త ఆలోచిస్తే బెటర్..



.jpg)
.jpg)

.webp)



