హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్
posted on Nov 5, 2025 7:09PM

హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి. మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను పలువురు అధికారులకు అప్పగించారు. తెలంగాణ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ పనులను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు భూసేకరణ చేయనున్నారు.