డబ్బులు డబుల్ చేస్తానంటూ రూ.25 లక్షల మోసం
posted on Oct 27, 2025 4:44PM

హైదరాబాద్ నగరంలో జరిగే కొన్ని వింత వింత ఘటనలు చూస్తూ ఉంటే...ఎక్కడి నుండి వస్తాయా ఈ ఆలోచనలు అని అనిపిస్తుంది. మోసం చేయడానికి పలుమార్గాలు మంచి మార్గంలో వెళ్లడానికి ఒకే మార్గం... అన్నట్లు గా మోసగాళ్లు పలు మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతూ ఉంటారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా కూడా కొంతమంది మూఢ నమ్మకాలను నమ్మి.. మోసపోతూ ఉంటారు.
భాగ్య నగరంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది... గురువు రూపంలో వచ్చిన ఒక వ్యక్తి భారీష్ పేరుతో డబ్బులు డబుల్ చేస్తా నంటూ ఓ అమాయకుడిని నమ్మించి బురిడీ కొట్టించాడు. అతని వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే...
నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (44) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి బహదూర్పుర పరిధిలో నివాసం ఉంటూ సోఫా వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుగోలోత్ రవీందర్ (40) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి ఫిలింనగర్ లో ఉంటూ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు.
మేడ్చల్ జిల్లాకు చెందిన కవీర సాయిబాబా (41) కొరియర్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మనోహర్ సింగ్ (39) ధోబి గా పని చేస్తున్నాడు. వీళ్ళందరికీ అబ్దుల్ ఖయ్యూమ్ గురువు.... వీరందరూ అమాయకులైన మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.
ముందుగా ఈ నిందితులు అమాయకులను గుర్తించి బారిష్ పూజ చేస్తే మీ వద్ద ఉన్న డబ్బులు డబుల్ అవుతుం దని నమ్మించి... వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు... ఈ తరుణంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కుకున్నాడు... ఒంటరిగా ఉన్న బాధితుడిన్ని టార్గెట్ గా చేసుకొని బారిష్ పూజ చేస్తే డబ్బులు అనేక రేట్లు పెరుగుతుందని నమ్మించారు. వీరి మాటలు నిజమని నమ్మిన బాధితుడు పూజకు సరైనని ఒప్పుకున్నాడు.
తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో అబ్దుల్ ఖయ్యూమ్ గురువు గా పరిచయం చేస్తూ ఈ ఐదుగురు నిందితులు.... బాధితుడు ఇంటికి వెళ్లి బారిష్ పూజ చేసి అనంతరం బాధితుడికి స్వీట్లు మరియు బాదం పాలు ఇచ్చారు... మత్తు కలిపిన బాదంపాలు ప్రసాదంగా స్వీకరించిన తర్వాత సదరు బాధితుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు.
అదే సమయంలో నిందితులు బాధితుడి వద్ద ఉన్న రూ. 25 లక్షల రూపాయలను తీసుకొని అక్కడి నుండి పారిపో యారు. స్పృహ వచ్చిన బాధితుడు చూసేసరికి గురువుతో పాటు శిష్యులు కూడా అక్కడ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగించారు.
నిన్న సాయంత్రం సమయంలో గండి మైసమ్మ వద్ద మహమ్మద్ ఇర్ఫాన్, రవీందర్, సాయి బాబా, ఠాకూర్ మనోహర్ సింగ్ లను అరెస్టు చేసి... వారి వద్ద నుండి ఒక గన్, కత్తి, రూ. 8,50,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ ఖయ్యూమ్ పరారీ లో ఉన్నాడు.
అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని మేడ్చల్ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి వెల్లడించారు...డబ్బులు ఎప్పుడు కూడా డబుల్ కావు.. అటువంటి పూజలే ఉండవు... ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా మోసపోతున్నారు. ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.