ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపారు : వీసీ సజ్జనార్
posted on Oct 25, 2025 9:33PM
.webp)
చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పులు సంఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపారని తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీ, అతని సహచరుడు స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునేందుకు ప్రయత్నించారని వివరించారు.
ఉమర్ అన్సారీపై 20కి పైగా కేసులు ఉన్నాయని, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ అయి ఉందని తెలిపారు. అతనిపై రెండు పీడీ యాక్ట్ కేసులు నమోదు అయ్యాయని, రెండేళ్లు జైల్లో ఉన్నాడని వెల్లడించారు. దొంగను పట్టుకునే ప్రయత్నంలో డీసీపీ సిబ్బంది గన్‌మెన్‌పై ఉమర్ కత్తితో దాడి చేశాడని, ఆపదలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. దాంతో ఉమర్ చేతి, కడుపు భాగాల్లో గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన దొంగను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో డీసీపీ చైతన్యకు స్వల్ప అస్వస్థత కలిగిందని, గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు క్షేమంగా ఉన్నారని సజ్జనార్ వెల్లడించారు.మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఉమర్ అన్సారీ నేరచరిత్రతో పాటు అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని తెలిపారు. నగరంలో రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని సజ్జనార్ హెచ్చరించారు