పెద్దపులి కోసం వేట.. రాజమహేంద్రవరంలో టెన్షన్ టెన్షన్

posted on: Feb 4, 2026 2:17PM

థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా పెద్దపులి సంచారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వణికించేస్తున్నది. గత నాలుగైదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటి వరకూ పులి కనిపించకుండా దాగుడుమూతలాడుతూ వచ్చింది. తాజాగా అది ఏకంగా రాజమహేంద్రవరం దివాన్ చెరు సమీపంలో ప్రత్యక్షమై స్థానికులను గడగడలాడించింది.  మంగళవారం (ఫిబ్రవరి 3) ఈ పెద్దపులి కెమెరా కంటికి చిక్కింది.   రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తున్నదన్న సమాచారంతో స్థానికులు బెంబేలెత్తిపెతున్నారు.  

మంగళవారం (ఫిబ్రవరి 3) ఉదయం రాజమహేంద్రవరం శివారులోని గాడాల ప్రాంతంలో  పులి పాదముద్రలు కనిపించాయి. రాత్రి ఏడుగంటల సమయంలో  ఆటోనగర్ ప్రాంతంలో పులికదలికలు లీలా మాత్రంగా కనిపించాయి. ఆ తరువాత కొద్ది సేపటికే పెద్దపులి దివాన్ చెరువు సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొబ్బరి తోటలోకి చొరబడింది. ఇందుకు సంబంధించి స్థానికులు తీసిన వీడియో సంచలనం సృష్టించింది.  

 దివాన్ చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొబ్బరి తోటలో పులి నక్కి ఉందన్న కచ్చితమైన సమాచారం మేరకు అధికారులు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇ కొబ్బరితోటలో ఓ పెంకుటింటిలో ఉన్న తోటమాలి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. ఫోన్ ద్వారా ఆ కుటుంబాన్ని హెచ్చరించిన అధికారులు ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టమైన సూచన చేశారు.  మరో వైపు పులిని బంధించేందుకు యద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పులిని బంధించేందుకు పూణే నిపుణుల సహాయం  కోరడంతో వారు రంగంలోకి దిగారు.

 ఈ పెద్దపులి రెండు వారాల కిందట  అంటే జనవరి 20న ఉమ్మడి పశ్చిమ గోదావరి  జిల్లా కొయ్యలగూడెంలో కనిపించింది.  ఆ తరువాత జనవరి 31న పట్టిసీమ   గోదావరి దాటి  సీతానగరం మండలం చినకొండేపూడి భూభాగంలోకి ప్రవేశించింది.  ఇదే పెద్దపులి ఈ నెల 1న  తొర్రేడు గ్రామంలో రెండు ఆవులు, ఒక దూడను వేటాడి చంపేసింది. ఫిబ్రవరి 2న వెంకటనగరం, కాతేరు గ్రామాల సమీపంలో పులి సంచరించింది.  మంగళవారం(ఫిబ్రవరి 3) రాజమహేంద్రవరం శివారులోని దివాన్‌చెరువు కొబ్బరి తోటలోకి చేరింది.  జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే పులి పొంచి ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠతో జనం, అధికారులు ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా పులిని బంధించాలని రాజమహేంద్రవరం వాసులు అధికారులను కోరుతున్నారు.

https://youtube.com/shorts/Xnas77tpKac?si=8onePIrvSESQybJf

 

google-ad-img
    Related Sigment News
    • Loading...