ఆ అధికారులపై కేసు.. వివేకా హత్య కేసులో డాక్టర్ సునీతకు నైతిక విజయం.. భారీ ఊరట!
posted on Nov 10, 2025 1:57PM

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరి డాక్టర్ సునీతకు ఏళ్ల తరబడి చేస్తున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. 2019లో తన తండ్రి దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటూ చేస్తున్న న్యాయపోరాటంలో డాక్టర్ సునీత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని పట్టుదలతో న్యాయం కోసం అవిశ్రా పోరాటం సాగించారు. సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సోదరుడు జగన్ ఉన్న సమయంలోనే ఆమెకు ఈ సవాళ్లు ఎదురయ్యాయి. వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు ఆమె, ఆమె భర్తపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విచారణలంటూ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సునీత, ఆమె భర్తపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులంటూ కొట్టివేసింది. అంతే కాదు.. ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన అప్పటి అధికారులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇంతకీ అప్పట్లో సునీతపై, ఆమె భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులు ఎవరంటే.. అప్పటి ఏఎస్ఐ రామకృష్ణ రెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. ఆ ఇద్దరూ కూడా ప్రస్తుతం పదవీవరమణ చేశారు.
అయినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిరువురిపై శాఖాపరమైన విచారణకు నిర్ణయించిందని చెబుతున్నారు. ఆ ఇరువురిపై శాఖాపరమైన విచారణ లేదా దర్యాప్తు పూర్తయ్యే వరకూ వారి పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ తప్పుడు కేసుల నమోదుకు తెరవెనుక ఉండి చక్రం తిప్పిన వారిని సౌతం గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.
ఇప్పటికే ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు నామోదైంది. లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి సునీత, ఆమె భర్తపై అక్రమ కేసులు నమోదు చేయడం, వేధించడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఎఎస్పీ రామకృష్ణారెడ్డి, ఏఎష్పీ రాజేశ్వరరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై వారిరువురిపై కేసు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంవత్సరాల పోరాటం తరువాత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు ప్రస్తుత పరిణామం నైతిక విజయంగా పరిశీలకులు ఆవిర్భవిస్తున్నారు. నాడు తప్పుడు కేసులతో తనను వేధించిన అధికారులే ఇప్పుడు నిందితులుగా బోనెక్కాల్సిరాడమంటే ఇది క చ్చితంగా వివేకా హత్య కేసులో న్యాయం దిశగా పడిన కీలక అడుగుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.