సింగరేణిలో బొగ్గు కుంభకోణం?!

posted on: Jun 6, 2026 9:09AM

తెలంగాణ రాజకీయాలలో మరో కుంభకోణం కలకలం రేపుతోంది. రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్ లో  1,600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిన  సంచలన ఆరోపణలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. సింగరేణికి చెందిన వివిధ స్టాక్‌యార్డులలో నిల్వ ఉంచిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోవడం వెనుక ఒక వ్యవస్థీకృత దోపిడీ దాగి ఉందని ఆయన ఆరోపించారు. రికార్డుల్లో చూపించిన బొగ్గు నిల్వలకు, క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న నిల్వలకు మధ్య హస్తిమసికాంతరం  వ్యత్యాసం ఉందన్నారు.

 రికార్డుల ప్రకారం మాయమైన ఈ బొగ్గు నిల్వలపై సెస్,  ఆదాయపు పన్ను కూడా చెల్లించినట్లు చూపిస్తున్నారనీ, కానీ  గ్రౌండ్ లెవెల్‌లో తనిఖీలో  అక్కడ బొగ్గు కనిపించకపోవడం వెనుక ఒక పెద్ద  మాఫియా హస్తం ఉందనీ ఆయన ఆరోపించారు.   40 లక్షల టన్నుల బొగ్గును రాత్రికి రాత్రే అక్రమంగా తరలించి, బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక  రహస్యం ఏమిటని ప్రశ్నించారు.  

ఈ భారీ బొగ్గు స్కామ్ వెనుక   రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపణ.  ఒకవేళ నేరుగా ప్రమేయం లేకపోయినా..  ఈ దోపిడీకి పాల్పడిన అసలు సూత్రధారులను, పెద్ద తలకాయలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందన్నారు.  అంతేకాకుండా, ఈ  వ్యవహారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య లోపాయికారీ ఒప్పందాలు, రహస్య సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ బొగ్గు దోపిడీపై తక్షణమే  సిట్టింగ్ జడ్జితో నిష్పక్షిక న్యాయ విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.ఈ మేరకు కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డికి   లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని   కోరారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...