Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ మినీ ఇరాన్ ఎలా అయ్యిందంటే?
posted on: Mar 4, 2026 9:27AM

హైదరాబాద్ ని మినీ ఇరాన్ అంటారని మీకు తెలుసా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతమైన వేళ.. ఇప్పుడిప్పుడే ఇలాంటి అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక్కడి గాలిలో ఇరానీ చాయ్ పరిమళాలు, గోడలపై పర్షియన్ పెయింటిగ్ లఅందాలు, ఆపై భాషలోని పర్షియన్ పదాలు వెరసీ హైదరాబాద్ ను ఒక మినీ ఇరాన్ అంటారు. హైదరాబాద్ ని మినీ ఇరాన్ అని పిలవడం వెనక ఐదు శతాబ్దాల చరిత్ర దాగి ఉంది. ఇదొక విడదీయరాని చారిత్రక సాంస్కృతిక బంధం. దక్షిణాదిలో ఇరానియన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మాత్రమే.
హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబు షాహీ వంశస్తులు ఇరాన్ లోని హమదాన్ ప్రాంతానికి చెందిన వారు. వీరు పర్షియా నుంచి ఇక్కడికి వచ్చి గోల్కొండ సామ్రాజ్యం నిర్మించారు. అందుకే హైదరాబాద్ పునాదుల నుంచీ ఇరాన్ కల్చర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగర ప్రణాళికలో ఇరాన్ లోని అతి పురాతన అందమైన నగరం ఇస్పహాన్ నమూనాలు కనిపిస్తాయి. కారణం హైదరాబాద్ నగర నిర్మాణ స్ఫూర్తి అక్కడిదే. చార్మినార్ నిర్మాణంలో పర్షియన్ వాస్తు శిల్ప కళ ఉట్టి పడుతుంది. మసీదు లోపల ఉండే అంకరణలు ఇరానీ వాస్తు సంప్రదాయానికి ప్రతిబింబాలు.
బాద్షాహీ అషుర్ఖానా.. ఇది నగరంలోని పురాతన షియా ప్రార్ధనా స్థలం. ఇక్కడ వాడిన ఎనామెల్ టైల్స్ నేరుగా.. ఇరాన్ నుంచి తెప్పించినవే. అవి నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. మనం నేడు హైదరబాద్ అంటే బిర్యాని, బిర్యానీ అంటే హైదరాబాద్ అంటూ ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ బిర్యానీ కూడా ఇక్కడిది కాదు. బిరియన్ అంటే వేయించినది అని అర్ధం. ఇదొక పర్షియన్ పదం. అలా పుట్టుకొచ్చిందే బిర్యానీ. మొఘల్, కుతుబ్ షాహీలు ఇరాన్ నుంచి తెప్పించిన వంటకం ఇది. ఇక్కడి సుగంధ ద్రవ్యాలు మరింత బాగా కలపడం వల్ల దీనికి హైదరాబాదీ బిర్యానీ అనే పేరు స్థిరపడింది. అదే హైదరాబాద్ బిర్యానీ అనే బ్రాండ్ గా అవతరించింది. ఇండియాలో ఎక్కడ చూసినా హైదరాబాద్ బిర్యానీ అనే షాపులు కనిపిస్తాయి. అంతగా ఫేమస్ అయ్యిందీ ఇరానియన్ వంటకం. హలీం కూడా ఇరానియన్ వంటకమైన హరీసా నుంచి పుట్టుకొచ్చిందే.
19వ శతాబ్ధంలో ఇరాన్ నుంచి వలస వచ్చిన వ్యాపారులు.. ఇరానీ చాయ్ ని పరిచయం చేశారు మనకు. పాలను బాగా మరగించి డికాషన్ తో కలిపి ఇవ్వడమే ఇరానీ చాయ్. హైదరాబాద్ ఫుడ్ కల్చర్ లో ఇదొక భాగం. సిటీలోని గార్డెన్ కేఫ్, నిలోఫర్, సఫ్రాన్ వంటివి ఇరానీ కల్చర్ కి కేంద్రాలు.హైదరాబాద్ కు ఇరాన్ కి ఉన్న సంబంధ బంధవ్యాలేంటో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా.. హైదరాబాద్ లో తన కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసుకుంది ఇరాన్. దీన్నిబట్టీ హైదరాబాద్ కి ఇరాన్ కి ఎంతటి అనుబంధముందో ఊహించుకోవచ్చు. పురాతన కాలం నాటి నుంచే ఇరాన్ తో హైదరాబాద్ కి సంబంధాలుండేవి. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 8 లో ఉన్న కాన్సులేట్.. ఇరాన్, తెలంగాణ మధ్య వ్యాపార, సాంస్కృతిక మార్పిడి కేంద్రంగా ఉంటోంది. ఈ కాన్సులేట్ ఉన్న వీధి పేరు కూడా ఇమామ్ ఖొమేనీ రోడ్.
ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్ర అధికారిక భాష పర్షియన్. తెలుగు, ఉర్దూ భాషల్లోని కొన్ని వేల పదాలు పర్షియన్ పదాల్లోంచి వచ్చి కలసినవే. ఉదాహరణకు దర్వాజా, బాగ్, కితాబ్ ఇవన్నీ పర్షియన్ పదాలే. ఇక్కడి పదాల్లా అవి ఎంతో అందంగా స్థిరపడిపోయాయి. హైదరాబాద్ లో ఇరాన్ కి మల్లే షియా ముస్లిం జనాభా ఎక్కువ. ఇదే ఇరాన్ తో మతపరమైన బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఏటా మొహర్రం జరిగే సమయంలో ఇక్కడి ఆచారాలు ఇరాన్ సంప్రదాయాలను పోలి ఉన్నట్టు కనిపిస్తాయి. అందుకే ఇక్కడ స్థానిక తెలుగు భాష రాని ఎందరో ఇరానియన్ షియా ముస్లిములు కనిపిస్తారు. అలా హైదరాబాద్ గాలిలో, గోడలపై, భాషలో ఎన్నో రకాల ఇరానియన్ ఛాయలు దర్శనమిస్తాయి. అందుకే హైదరాబాద్ కు ఒక మినీ ఇరాన్ అన్న పేరు వచ్చింది.






