గ్యాస్ట్రిక్ తలనొప్పి.. ఇదెంత డేంజరో తెలుసా?
posted on: Feb 19, 2026 2:44PM

తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య. ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం, భోజనం ఆలస్యం కావడం, సరిపడని ఆహారం తినడం వంటివి తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి ఒత్తిడి వల్ల లేదా పైన చెప్పుకున్న సమస్యల వల్ల వస్తుందని అనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు తలనొప్పికి పొట్ట ఆరోగ్యం కూడా కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు. దీనిని సాధారణంగా గ్యాస్ తలనొప్పి లేదా గ్యాస్ట్రిక్ తలనొప్పి అని పిలుస్తారు. అసలు గ్యాస్ తలనొప్పి ఎలా వస్తుంది? ఈ తలనొప్పి వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే..
గ్యాస్ తలనొప్పి..
గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది. చాలా మందిలో కడుపులో ఉండే సమస్య తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధికంగా టీ, కాఫీ తీసుకోవడం, నిరంతర ఒత్తిడి ఇవన్నీ వంటివన్నీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.
గ్యాస్ట్రిక్ తలనొప్పి..
గ్యాస్ట్రిక్ తలనొప్పి లైట్ గా ఉండవచ్చు లేదంటే ఎప్పుడూ తలనొప్పిగా కూడా ఉండవచ్చు. అయితే గ్యాస్ట్రిక్ మైగ్రేన్ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది కాంతికి, శబ్దాలకు చాలా రియాక్ట్ అవుతుంది. వికారం లేదా వాంతులు కూడా ఉండొచ్చు. రెండింటిలోనూ అంతర్లీనంగా జీర్ణ సమస్యలే కారణం. ఈ సమస్య అప్పుడప్పుడు వస్తే అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తరచుగా వస్తుంటే మత్రం లైట్ గా తీసుకోకూడదు. గ్యాస్ తలనొప్పి పదే పదే వస్తుంటే దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు.
డాక్టర్ ను ఎప్పుడు కలవాలి..
వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే, వాంతులు అవుతున్నా లేదా తీవ్రమైన కడుపు నొప్పిని ఉంటున్నా, లేదా ఇంటి చిట్కాలు ఫాలో అయినా ఉపశమనం కలగకపోతే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే, ఎండోస్కోపీ వంటి పరీక్షలు జీర్ణవ్యవస్థ పరిస్థితిని స్పష్టం చేస్తాయి.
చికిత్స అంటే నొప్పి నివారణ మందులు మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమయానికి తినడం, తేలికైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, నిరాశకు దూరంగా ఉండటం వంటివి ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






