Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాకిస్థాన్ విక్టిమ్ కార్డ్.. ఇంకా ఎంత కాలం?
posted on: Jun 1, 2026 11:27AM

చాప్టర్-1 బాధితురాలి వేషంలో పాకిస్థాన్.. ఐక్యరాజ్యసమితి వేదికపై పాత నాటకం, కొత్త సందర్భం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చల వేదికపై పాకిస్థాన్ మళ్లీ ఒకసారి తనకు బాగా అలవాటైన పాత్రలోకి జారుకుంది.
బాధితురాలి పాత్ర అనే అంశానికి వస్తే.. ఇందులో పైకి కనిపించేది ఒకటి. లోపల మరొకటిగా అంచనా వేస్తున్నారు. జమ్మూ–కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయీకరించేందుకు, భారతదేశాన్ని దాడి చేసే దేశంగా చిత్రీకరించేందుకు, అంతర్జాతీయ చట్టం, శాంతి, స్థిరత్వం వంటి పదాలను తన నోట పెట్టుకుని ఇస్లామాబాద్ మరోసారి అదన ప్రసంగం ప్రారంభించింది.
కానీ ఈ కథలో అసలు విరోధాభాసం, అంటే పైకి ఒకటి లోపలికి మరొకటి అనే నాటకం- ఇక్కడే ఉంది. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని విదేశాంగ సాధనంగా ఉపయోగించిన పాకిస్థాన్.. తన అధికారిక సిద్ధాంతంలోనే వెయ్యి కోతల ద్వారా భారతదేశాన్ని రక్తస్రావం చేయడం, అనే భావజాలాన్ని స్థాపించుకున్న దేశం. ప్రపంచానికి శాంతి, చట్టబద్ధత, స్థిరత్వం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రయత్నించడం ఒక వింత. విడ్డూరం. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఒక నైతికత లోపించడంతో సమానం కూడా. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశం, శాంతి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం.. ఇదే పాకిస్థాన్ వాదనలోని అసలైన డొల్లతనం.
ఈసారికి భారతదేశం ఈ నాటకాన్నిఅంత తేలిగ్గా వదిలేయలేదు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరేష్ పర్వతనేని నేరుగా, స్పష్టంగా.. ఎలాంటి సున్నితత్వం లేకుండా పాకిస్థాన్‌ను సరిహద్దు ఉగ్రవాదం ప్రోత్సాహకుడిగా, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధంగా ప్రవర్తించే దేశంగా ఎత్తి చూపించారు.
చాప్టర్-2 భారత ప్రతిస్పందన.. సరిహద్దు ఉగ్రవాదంపై నేరుగా బహిరంగ ఆరోపణ. రాయబారి హరేష్ పర్వతనేని చేసిన వ్యాఖ్యలు, కేవలం ఒక డిప్లొమాటిక్ రిప్లై కాదు. అవి భారతదేశం యొక్క దీర్ఘకాలిక అనుభవం, చారిత్రక బాధ, భద్రతా వాస్తవికతల సమ్మేళనం.
ఆయన ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా గుర్తు చేశారు. స్వతంత్ర భారతదేశం తన ప్రయాణాన్ని ప్రారంభించిన మొదటి రోజుల్లోనే పాకిస్థాన్ ప్రేరేపిత దాడులు, సరిహద్దు దురాక్రమణ, ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొనాల్సి వచ్చిందని. ఎన్నో గాయాల ద్వారా భారతదేశాన్ని రక్తం స్రవించేలా చేయడం అనే పాకిస్థాన్ సిద్ధాంతం, దాని రాష్ట్ర విధానానికి కేంద్రబిందువుగా ఉన్నదని, ఐక్యరాజ్యసమితి వేదికపై భారత ప్రతినిధి బహిర్గతం చేశారు.
సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంది.
ఇది కేవలం ఒక రాజకీయ వాదన కాదు. అంతర్జాతీయ చట్టం ప్రకారం కూడా, ఏ దేశానికైనా తన భూభాగం, తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి స్వీయరక్షణ హక్కు ఉంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, భారతదేశంలో జరిగిన అనేక దాడులు.. పంజాబ్, జమ్మూ–కాశ్మీర్, ముంబై, పుల్వామా – ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలు కాదు.. పాకిస్థాన్ కుట్ర పూరిత బుద్ధిలోంచి పుట్టుకొచ్చిన రక్తసిక్త ఫలితాలు.
భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఇకపై మేము దేన్నీ సాఫ్ట్ గా చెప్పాలనుకోవడం లేదు. కారకులెవరో కుండబద్దలు కొడుతూ చెప్పే కఠిక వాస్తవం.
చాప్టర్-3 ఈసారి భారత ప్రతిస్పందన ఎందుకు మరింత కఠినంగా వచ్చింది? అని చూస్తే.. భారత ప్రతిస్పందనకు తక్షణ కారణం.. పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూ–కాశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తడం, అలాగే భారతదేశం సింధు జలాల ఒప్పందం అమలుపై ప్రశ్నలు లేవనెత్తడం.
ఇది కూడా ఒక విరోధాభాసమే. అంటే పైకొకటి, లోపలికొకటీ అన్నమాట. సింధు జలాల ఒప్పందం ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన జల ఒప్పందాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశం తనకు చట్టబద్ధంగా ఉన్న హక్కుల కంటే కూడా, సహనం ప్రదర్శించిన సందర్భాలే ఎక్కువ. అయినప్పటికీ, పాకిస్థాన్ తన అంతర్గత వైఫల్యాలను, నీటి నిర్వహణలో తన నిర్లక్ష్యాన్ని, రాజకీయ అస్థిరతను దాచిపెట్టడానికి, ఈ ఒప్పందాన్ని కూడా ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తోంది.
అయితే, ఈసారి భారత ప్రతిస్పందన కేవలం సింధు జలాల ఒప్పందం గురించే కాదు. చైనా–పాకిస్థాన్ సంయుక్త ప్రకటన, అందులో జమ్మూ–కాశ్మీర్, సీపీఈసీ, సరిహద్దు జల సహకారం వంటి పదాల వినియోగం.. ఇవన్నీ కలిపి న్యూఢిల్లీకి ఒక స్పష్టమైన వ్యూహాత్మక సవాలుగా కనిపించాయి. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ – ఇవి భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం. ఇందులో మరో చర్చకు తావు లేదు.
చాప్టర్-4 సీపీఈసీ – చట్టపరంగా, వ్యూహాత్మకంగా, వాస్తవికంగా చూస్తే.. చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ సీపీఈసీను సంవత్సరాల పాటు ఒక గేమ్ ఛేంజర్ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు మకుటాయమానం అన్నారు. పాకిస్థాన్ ఆర్థిక పునరుజ్జీవనానికి బిలియన్ డాలర్ల రాచ మార్గంగా ప్రచారం చేశారు.
కానీ భారతదేశం దృష్టిలో సీపీఈసీకు మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి. వాటిలో మొదటిది చట్టపరమైన సమస్య. సీపీఈసీలోని కీలక భాగాలు, అంతర్జాతీయంగా భారతదేశ భూభాగంగా గుర్తించబడిన, కానీ ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే )గుండా వెళ్తాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఒక దేశం ఆక్రమించిన ప్రాంతంలో, ఆ ప్రాంతం- అసలు సార్వభౌమాధికారి అంటే భారతదేశాన్ని.. సంప్రదించకుండా, మూడో దేశమైన చైనాతో కలిసి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టడం.. ఇది సార్వభౌమాధికార ఉల్లంఘన కింద పరిగణిస్తారు.
ఇక పోతే మరో ముఖ్యమైన అంశం. సార్వభౌమాధికార సమస్య. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా ప్రకటించింది.. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం, అవి ఎప్పటికీ భారతదేశంలో భాగంగానే ఉంటాయి. ఇందువల్ల.. PoK గుండా వెళ్లే CPEC భాగాలు, భారతదేశం దృష్టిలో చట్టవిరుద్ధమైనవి, అక్రమమైనవి, ఆమోదయోగ్యం కానివి.
వాస్తవిక ఆర్థిక భద్రతా సమస్య ఎలాంటిదో చూస్తే.. పాకిస్థాన్ అప్పుల్లో కూరుకుపోయింది. సీపీఈసీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన అప్పు భారం, వడ్డీ చెల్లింపులు, చైనా కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత. ఇవన్నీ కలిపి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి తెచ్చాయి. అదే సమయంలో, పాకిస్థాన్‌లోని.. చైనా కార్మికులపై పదేపదే దాడులు, బలూచిస్తాన్, గ్వాదర్, కారకోరం ప్రాంతాల్లో భద్రతా సమస్యలు. ఇవన్నీ సీపీఈసీను ఒక భద్రతా ప్రమాదంగా కూడా మార్చాయి.
సీపీఈసీ విషయంలో పత్రికా ప్రకటనలు ఎలా ఉంటాయంటే, ఇదొక గేమ్ ఛేంజర్ గా వర్ణించేవారు. నిజానికిది అప్పు, అస్థిరత, భద్రతా సంక్షోభాల కారిడార్ గా చెప్పాల్సి ఉంటుంది.
చాప్టర్- 5 సరిహద్దు జల సహకారం.. చైనా–పాకిస్థాన్ వాదన, భారత అభ్యంతరం అనే అంశాన్ని పరిశీలిస్తే.. చైనా–పాకిస్థాన్ సంయుక్త ప్రకటనలో మరో ఆసక్తికరమైన పదం కనిపించింది. సరిహద్దు జల సహకారం అనే విషయం.. భారతదేశం ఒక ప్రాథమిక ప్రశ్న లేవనెత్తింది. చర్చిస్తున్న ప్రాంతాలలో చైనా, పాకిస్థాన్‌లకు ప్రత్యక్ష భూసరిహద్దు లేదు.
అలాంటప్పుడు సరిహద్దు జల సహకారం అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుంటే.. దాని అర్థం స్పష్టంగా ఉంది. ఇది భారతదేశ భూభాగాన్ని పరోక్షంగా చర్చలోకి లాగేందుకు చేసిన ప్రయత్నం. పీవోకే ప్రాంతం గుండా ప్రవహించే నదులు, హిమాలయ ప్రాంతంలోని జల వనరులు.. ఇవన్నీ భారతదేశ సార్వభౌమాధికార పరిధిలోకి వస్తాయి.
అందువల్ల, చైనా–పాకిస్థాన్ సరిహద్దు జల సహకారం అనే పదాన్ని ఉపయోగించడం, భారతదేశం దృష్టిలో ఆక్రమణను చట్టబద్ధం చేయాలనే ప్రయత్నం, భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేయాలనే రాజకీయ సంకేతం. సరిహద్దు జల సహకారం అనే పదం సంగతేంటో చూస్తే.. వాస్తవానికి భారత భూభాగాన్ని పరోక్షంగా చర్చలోకి లాగేందుకు చేసిన రాజకీయ ప్రయత్నం.
చాప్టర్-6, పాకిస్థాన్–చైనా సమావేశం, సీపీఈసీ పునరుద్ధరణ, భద్రతా వాస్తవికత విషయానికి వస్తే.. బీజింగ్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్తో సమావేశమైన తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటనలో.. CPECను పునరుద్ధరించాలి, అత్యున్నత నాణ్యత గల అభివృద్ధి సాధించాలి. గ్వాదర్ పోర్టు, కారకోరం హైవే, ఖుంజెరాబ్ కనుమ మార్గాలను అభివృద్ధి చేయాలి అనే ప్రకటనలు గుప్పించారు.
కానీ అదే ప్రకటనలో.. పాకిస్థాన్- చైనా కార్మికుల భద్రతను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒక్కటే CPEC అసలు నిజాన్ని బయట పెడుతోంది.
పర్యావసానం- ప్రాజెక్టులు నిలిచిపోవడం, భద్రతా పరిస్థితి క్షీణించడం, స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరగడం.. చైనా కూడా ఇప్పుడు పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
అంటే, ఒకప్పుడు గేమ్ ఛేంజర్ గా ప్రచారం చేసిన సీపీఈసీ, ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆర్థిక భారంగా, చైనాకు భద్రతా ప్రమాదంగా, ప్రాంతానికి రాజకీయ అస్థిరతకు కారణంగా మారింది.
చాప్టర్-7.. కాశ్మీర్‌పై పాకిస్థాన్ వ్యామోహం అంశంపై ఒక పరిశీలన చేస్తే.. ప్రపంచం మారింది. అయితే పాక్ వినిపించే కథనం మాత్రం మారలేదు. అది అలాగే ఉంది. పాకిస్థాన్ ఇప్పటికీ తన పాత వ్యూహాన్నే అనుసరిస్తోంది. భారత భూభాగంపై అభ్యంతరం చెబుతూనే ఉంది. జమ్మూ–కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయీకరించడానికి ప్రయత్నీస్తూనే ఉంది. చైనాపై దౌత్యపరమైన రక్షణ కోసం ఆధారపడుతూనే ఉంది. ఐక్యరాజ్యసమితి వేదికపై విక్టిమ్ యాంగిల్ ని వినిపిస్తూనే ఉంది.
కానీ ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రపంచం ఇలాంటి కథలు వినడం మానేసింది. ఇది కోల్డ్ వార్ జమానా. 1990ల దశకం, 9/11 ఆ తర్వాతి కాలం. ఈ మూడు దశల్లో పాకిస్థాన్ తన వ్యూహాత్మక స్థానాన్ని బలంగా ఉపయోగించి, అమెరికా, చైనా, పాశ్చాత్య దేశాల దగ్గర అవసరమైన మిత్రుడుగా నిలిచింది. కానీ ఇప్పుడు.. ఉగ్రవాదంపై ప్రపంచ దృష్టి మరింత కఠినతరంగా మారింది.
ఆర్థిక పారదర్శకత, ఎఫ్ఏటీఎఫ్, గ్రే లిస్ట్ వంటి అంశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చాయి. భారతదేశం ఒక పెద్ద ఆర్థిక, వ్యూహాత్మక శక్తిగా ఎదిగింది. గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు, ఆసియా దేశాలు.. ఇవన్నీ భారతదేశంతో సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ చేసే బీద అరుపులను ప్రపంచం ఇప్పుడు సందేహంతో, కొన్నిసార్లు నిర్లక్ష్యంతో చూస్తోంది.
శాంతిని నాశనం చేసే వ్యవస్థలకే ఆశ్రయం కల్పిస్తూ, శాంతి గురించి మాట్లాడలేరు.. ఇదే భారతదేశం ప్రపంచానికి చెబుతున్న అసలు సందేశం.
చాప్టర్-8.. న్యాయపర, రాజకీయ, సామాజిక కోణాల సమగ్ర సమీక్షఅన్న విషయానికి వస్తే..
అందులో మొదటిది న్యాయపరమైన కోణం. భారతదేశానికి స్వీయరక్షణ హక్కు ఉంది. సరిహద్దు ఉగ్రవాదం, పాకిస్థాన్ ప్రేరేపిత దాడుల నేపథ్యంలో ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం సమర్థించబడుతుంది.
పీవోకే గుండా వెళ్లే సీపీఈసీ భాగాలు, భారతదేశం దృష్టిలో సార్వభౌమాధికార ఉల్లంఘన కిందకు వస్తాయి. సరిహద్దు జల సహకారం అనే పదం, భారత భూభాగాన్ని పరోక్షంగా చర్చలోకి లాగేందుకు చేసిన రాజకీయ న్యాయపర ప్రయత్నం కూడా.
రెండోది- రాజకీయ కోణం. పాకిస్థాన్ అంతర్గత రాజకీయ వైఫల్యాలను, ఆర్థిక సంక్షోభాన్ని, పాలనా లోపాలను దాచిపెట్టడానికి, కాశ్మీర్ అంశాన్ని శాశ్వత రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోంది.
చైనా, పాకిస్థాన్‌ను తన వ్యూహాత్మక కారిడార్‌గా ఉపయోగించుకుంటూ, భారతదేశంపై భౌగోళిక ఒత్తిడి సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.
భారతదేశం, ఇకపై సమతుల్య భాషలో కాకుండా, నేరుగా, స్పష్టంగా, పేరుపేరునా పాకిస్థాన్–చైనా చర్యలను బహిర్గతం చేసే దిశగా కదులుతోంది.
మూడోది.. సామాజిక–మీడియా కోణం. పాకిస్థాన్ అంతర్గతంగా కూడా సీపీఈసీపై, చైనా ప్రభావంపై, అప్పు బానిసత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు సీపీఈసీను గేమ్ ఛేంజర్ గా కాకుండా, అప్పు, భద్రతా, అస్థిరతల కథగా చూడడం ప్రారంభించింది.
భారత మీడియా, దౌత్య వర్గాలు, వ్యూహాత్మక విశ్లేషకులు.. వీరు ఇప్పుడు పాకిస్థాన్ వాదనను సవాలు చేసే, బహిర్గతం చేసే, డాక్యుమెంట్ చేసే దిశగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్థాన్ బాధిత నాటకం ముగిసింది. వాస్తవాల యుగం ప్రారంభమైంది
ఐక్యరాజ్యసమితి వేదికపై ఈసారి జరిగిన భారత–పాకిస్థాన్ మాటల మార్పిడి, ఒక పెద్ద మార్పుకు సంకేతంగా మారింది.
భారతదేశం ఇకపై రాజకీయ సమతుల్యత పేరుతో వాస్తవాలను నీరుగార్చే దశలో లేదు.
పాకిస్థాన్ చెప్పే బాధిత కథనాన్ని, భారతదేశం చారిత్రక ఆధారాలు, ఉగ్రవాద దాడుల రికార్డులు, సార్వభౌమాధికార వాస్తవాలుతో బద్దలుకొడుతోంది.
సీపీఈసీ, పీవోకే, సరిహద్దు జల సహకారం వంటి అంశాలపై, భారతదేశం న్యాయపరంగా, వ్యూహాత్మకంగా, రాజకీయంగా తన స్థానం మరింత కఠినంగా, స్పష్టంగా ప్రపంచానికి తెలియజేస్తోంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.


.webp)



