ఇరాన్, అమెరికా యుద్ధం ఎండ్ కార్డ్ ఆశలు మళ్లీ ఆవిరి?

posted on: May 26, 2026 9:12AM

ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సుదీర్ఘంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైందనీ, ఇక యుద్ధానికి ఎండ్ కార్డేనన్న వార్తల వినవచ్చాయి. అయితే.. ఆ ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్  తెలిపింది.  ఇరాన్  తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన  అల్ హదత్  మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్  ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.

అమెరికా, ఇరాన్ మధ్య జరగబోయే అవగాహన ఒప్పందం వివరాలు అంటూ.. అల్ హదత్ ప్రచురించిన నివేదిక పూర్తిగా అవాస్తవమని, ఇది అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని తస్నిమ్  పేర్కొంది.  ఇప్పటివరకు ఉన్న ఒప్పంద ప్రతిపాదనలో అణు పదార్థాల తరలింపునకు సంబంధించిన నిబంధనలేవీ లేవని స్పష్టం చేసింది. శుద్ధి చేసిన యురేనియం తరలింపునకు ఇరాన్ అంగీకరించలేదని  తస్నిమ్ తన కథనంలో విస్పష్టంగా పేర్కొంది. 

 ఇలా ఉండగా, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ సోమవారం (మే 25)   వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నిరాశపరచాలంటే దేశంలో ఐక్యత, సంఘీభావం అవసరమన్నారు.

కాగా, అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అంతకుముందు చెప్పారు.  14 క్లాజులతో కూడిన ఈ ఒప్పందంపై 30 నుంచి 60 రోజుల్లో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ఆపడం, నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఈ ఒప్పందంలో కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...