నేటి యువతకు ఓపిక తక్కువ.. హనీమూన్ హత్య కేసుపై సుప్రీం వ్యాఖ్యలు..!

posted on: Jul 23, 2026 6:12PM

 

ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!

సమాజంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, సాంకేతిక ప్రభావం వల్ల నేటి యువతలో సహనం క్షీణిస్తోందని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానసిక ఒత్తిడిని ఏవిధంగా జయించాలో తెలియక చిన్న చిన్న సమస్యలకు కూడా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'హనీమూన్ హత్య' కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాళేలతో కూడిన ధర్మాసనం నిందితురాలి బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల వ్యవధిలోనే పోలీసుల ముందు లోంగిపోవాలని నిందితురాలిని కోర్టు స్పష్టం చేసింది. 

ఈ కేసు విచారణ సందర్భంలోనే నేటి తరం ప్రవర్తన, మారుతున్న సామాజిక సంబంధాలపై ధర్మాసనం పలు ఆసక్తికరమైన, లోతైన పరిశీలనలను పంచుకుంది. ప్రస్తుత కాలంలో జ్ఞానం పెరుగుతున్నప్పటికీ, యువతలో భావోద్వేగ నియంత్రణ కరువవుతోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రతి సమస్యకూ తక్షణ పరిష్కారం కావాలని ఆరాటపడటం, సోషల్ మీడియా సమాచారాన్నే నిజమైన విజ్ఞానంగా భావించి పొరబడటం వల్ల ఈ తరంలో చికాకు, అసహనం ఎక్కువవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విచారణలో మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. దంపతుల మధ్య పరస్పర నమ్మకం తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

గతంలో ఉమ్మడి కుటుంబాలు సమస్యలను చక్కదిద్దేవని, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని బలపరుస్తూ, చిన్న కుటుంబాల సంస్కృతి వల్ల పిల్లలు సర్దుకుపోయే తత్వాన్ని నేర్చుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేసింది. పిల్లలు ఏడిస్తే వారి చేతికి డిజిటల్ గ్యాడ్జెట్లు ఇచ్చి మభ్యపెట్టడం వల్ల, భవిష్యత్తులో వారు చిన్న నిరాశను కూడా తట్టుకోలేకపోతున్నారని కోర్టు గుర్తుచేసింది. మారుతున్న ఈ సామాజిక ధోరణులు, కుటుంబ వ్యవస్థలోని లోపాలు భవిష్యత్తులో నేరాల పెరుగుదలకు కారణమవుతాయన్న చర్చ ఈ తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయో, నిందితురాలు లోంగిపోయిన తర్వాత విచారణ ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Honeymoon murder case, Supreme Court comments, Sonam Raghuvanshi, Raja Raghuvanshi, todays generations tolerance
 

google-ad-img
    Related Sigment News
    • Loading...