Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ. 10 నుంచి లక్ష విలువైన వస్తువులు.. దేశంలోనే అతిపెద్ద నాంపల్లి ఎగ్జిబిషన్ కు 85 ఏళ్లు..
posted on: Jan 2, 2022 3:19PM
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన.. ఎగ్జిబిషన్. ఈ పేరు వింటేనే హైదరాబాద్ వాసులకు పండగ. ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌కు ఎంతో క్రేజ్ ఉంది. వేల సంఖ్యలో స్టాళ్లు..ఇతర రాష్ట్రాల వస్తువులు..వినోదానికి పెద్దపీట..కోట్ల రూపాయల వ్యాపారంతో నుమాయిష్ కు దేశవ్యాప్తంగా పేరుంది. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచే నుమాయిష్‌కు 85 ఏళ్ల క్రితం బీజం పడింది.
అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా మారింది. 80 స్టాల్స్‌తో దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 50 లక్షల మంది సందర్శకులతో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా గుర్తింపు సాధించింది.
నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే..
1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు సమకూరుతాయని వారు వివరించారు. అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్‌కు పంపించారు. దీంతో ఉస్మాన్‌అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు.

నుమాయిష్ ఎక్కడ..ఎలా నిర్వహించాలనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పట్టభద్రుల సంఘం వివిధ పనులకు కమిటీలు ఏర్పాటు చేసింది. తొలుత పరిశ్రమలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసే కర్మాగారాలు, అప్పట్లో ఉన్న పెద్ద దుకాణాల నిర్వాహకులు, యజమానులను సంప్రదించి నూమాయిష్ ఆవశ్యకతను వివరించారు.అటు జంట నగర ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వేతికారు. చివరికి బాగేఆమ్ (పబ్లిక్ గార్డెన్)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.చివరకు తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించారు.
1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నుమాయిష్ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. స్థాపించిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రజాదరణ పెరిగింది. నుమాయిష్‌లో స్టాల్స్ పెరగడంతో పబ్లిక్ గార్డెన్స్‌లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. చివరికి నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. 1946లో హైదరాబాద్ అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. నేటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది.

నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఎమిటేంటే..ఇక్కడ రూ.10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తుంటాయి. నగర, రాష్ట్ర, దేశ విదేశీ పరిశ్రమల్లో తయారు చేసిన దాదాపు 10 లక్షలకుపైగా వైరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఫుడ్ ఐటమ్స్‌తో పాటు సంస్కాృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వినోదం కోసం రకరకాల ఐటమ్స్ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. అందుకే దీన్ని దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా గుర్తిస్తున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ గతేడాది వరకు విరామం లేకుండా ప్రతి ఏటా కొనసాగింది. గతేడాది కరోనాతో నుమాయిష్‌ను మూసివేసారు. ఈ ఏడాది కేవలం 1500 స్టాల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు.





