Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచుమనిషి దొరికినట్లేనా!
posted on: Feb 2, 2016 3:34PM

హిమాలయాల్లో మనిషిని పోలిన ఆకారంతో ఎతి అనే భారీ జీవి సంచరిస్తోందన్నది వందల ఏళ్లుగా వస్తున్న నమ్మకం. అయితే ఇంతవరకూ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ కనిపించనేలేదు. ఏదన్నా ఒక ఆధారం కనిపించినా కూడా అది హేతువాదుల అనుమానాల ముందర వీగిపోయేది. కానీ ఇప్పడు తాను ఎతి సంచారానికి సంబంధించిన ఒక బలమైన సాక్ష్యాన్ని సంపాదించానంటున్నారు ‘స్టీవ్ బెర్రీ’ అనే బ్రిటిష్ యాత్రికుడు. స్టీవ్ బెర్రీకి పర్వతాలను ఎక్కడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే స్టీవ్, భూటాన్‌లో ఉన్న గంగ్‌ఖర్ అనే పర్వతాన్ని ఎక్కుతుండగా అతనికి ఎతికి సంబంధించిన పాదముద్రలు కనిపించాయట. హిమాలయ పర్వతశ్రేణిలో భాగమైన ఈ గంగ్‌ఖర్ పర్వత శిఖరాన్ని ఇంతవరకూ మనుషులెవ్వరూ చేరుకోలేదు. అలాంటి పర్వతం మీద వాలుగా ఉన్న ఒక చోట వరుసగా కనిపించే పాదముద్రలు మనిషివి అవడానికి వీల్లేదు అంటున్నారు స్టీవ్. ఎందుకంటే నరమానవుడెవ్వరూ ఇంతవరకూ ఆ ప్రదేశాన్ని చేరుకోలేదుట. ఇక ఆ పాదముద్రలు చూస్తేనేమో ఏదో నాలుగుకాళ్ల జంతువుదిలాగా తోచడం లేదు. ఇక అంత వాలుగా ఉండే చోట మరో జంతువు ఏదీ రెండు కాళ్ల మీద నడవడం అసాధ్యం అంటున్నాడు ఈ పర్వతారోహకుడు. వెరసి ఈ ముద్రలు ఎతి అనే మంచుమనిషివే అని జనాల్ని కూడా నమ్మమంటున్నాడు. అయితే కేవలం పాదముద్రల ఫొటోని చూపించి ఎతిని నిరూపించడం ఏమంత సులభం కాదు. మంచు కొండల మీద చిన్నపాటి ముద్రలు సైతం నిరంతరం కురిసే మంచు వల్ల చిత్రవిచిత్రమైన ఆకారాలని సంతరించుకుంటాయి. పైగా స్టీవ్ మాటని జనాలు సందేహించేందుకు ఓ ముఖ్య కారణం కూడా ఉంది. స్టీవ్ బెర్రీ ‘మౌంటెన్ కింగ్‌డమ్స్’ అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థ యాత్రికులు హిమాలయాలలోకి తీసుకువెళ్తూ ఉంటుంది! ఈ మాట విన్నాక స్టీవ్ చెబుతున్న విషయం మీద జనాలకి మరిన్ని అనుమానాలు మొదలైపోయాయి. ఇంతకీ మరి ఆ అడుగులు ఎవరివో!






