హిమాచల్‌ ముఖ్యమంత్రి అరెస్టుకు రంగం సిద్ధం

posted on: Mar 29, 2016 2:50PM

 

అక్రమార్జన కేసులో హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ త్వరలోనే అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను అధికారులు వీరభద్ర సింగ్‌ ఆస్తులకి సంబంధించి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో, వీరభద్ర సింగ్‌ తప్పు మీద తప్పు చేసినట్లు కనిపిస్తోంది. తన దగ్గర పట్టుబడిన ఆస్తులన్నీ సక్రమమైనవే అని రుజువు చేసుకునేందుకు, ఆయన పాత తేదీలతో ఉన్న స్టాంప్‌ పేపర్ల మీద కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లు తేలింది. కొత్తగా చూపిస్తున్న ఒప్పందాల ప్రకారం తన ఆస్తి లక్షల్లో కాదు, కోట్లలో ఉందనీ.... ఇదంతా కూడా తన యాపిల్‌ తోటల మీద న్యాయంగా సంపాదించిన సొమ్మనీ ఆయన రుజువు చేసే ప్రయత్నం చేశారు.

 

అయితే ఈ విషయాన్ని అధికారులు పసిగట్టడంతో వీరభద్రసింగ్ పప్పులు ఉడకలేదు. దాంతో అక్రమార్జనకు సంబంధించిన కేసులే కాకుండా నకిలీ దస్తావేజులను సృష్టించిన ఆరోపణల్లో కూడా ఆయన విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఒక పక్క సీబీఐ విచారణ, మరోపక్క అరెస్టుకు సమాయత్తం అవుతున్న ఈడీ అధికారులు.... ఇలా కష్టాలలో మునిగి ఉన్న వీరభద్ర సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్‌ అధిష్టానం కూడా షాక్‌ ఇవ్వనుందని సమాచారం. ఇదే కనుక జరిగితే అటు అరుణాచల్‌, ఇటు హర్యానాలలో తమ ప్రభుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్... ఇప్పడు హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా కష్టకాలాన్ని ఎదుర్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...