ఢిల్లీలో హై టెన్షన్.. నిఘా నీడలో జంతర్ మంతర్!

posted on: Jun 6, 2026 12:54PM

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటు చూసినా కాకీ దుస్తుల పహారా, ఇంటెలిజెన్స్ వర్గాల ముమ్మర తనిఖీలతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్  , సీబీఎస్‌ఈ  పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.  

జంతర్ మంతర్ వేదికగా ఈ భారీ సభ గనుక జరిగితే ఊహించని విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులను అదుపు చేయడానికి కాక్రోచ్ పార్టీ ప్రతిపాదించిన ఈ భారీ నిరసన సభకు ఢిల్లీ పోలీసులు తొలుత  అనుమతి నిరాకరించినా  చివరకు అనుమతి ఇచ్చారు.  ఈ నిరసన ప్రదర్శనలో కాక్రోజ్ జనతాపార్టీ   వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పాల్గొన్నారు.  ఈ ఉదయం ఆయన  అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు.  ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన అభిజిత్ దిప్కే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని మీడియాకు కనిపించారు. ఈ నిరసన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎ  నిరసన వేదిక వద్ద దాదాపు 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని, సాయుధ బలగాలను మోహరించారు. 

 దేశం నలుమూలల నుండి నిరసనకారులు, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వైపు తరలివచ్చారు.  జంతర్ మంతర్, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారులను తమ పూర్తి నిఘా నీడలోకి తీసుకువచ్చారు.  

నిరుద్యోగ యువత, పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థుల సమస్యలపై కేవలం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ, చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ పార్టీ చేపట్టిన ఈ తాజా నిరసన కార్యక్రమానికి కేవలం విద్యార్థుల నుంచే కాకుండా, పలువురు దేశీయ రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ పోరాటం ఢిల్లీని ఎంతవరకు ఊపేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...