పరకామణి చోరీ కేసు.. సాక్షుల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు
posted on Nov 18, 2025 12:13PM
.webp)
తిరుమల తిరపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో సాక్షులు, నిందితుల భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ సీవీఎస్వో సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు, నిందితుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన హై కోర్టు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ తో పాటు సాక్షులందరినీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజీకి విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలనీ, అలాగే విచారణ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అనంతరం కేసును డిసెంబర్ 2కు వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఇటీవల టీటీడీ మాజీ సీవీఎస్వో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సతీష్ మరణాన్ని తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తర్వాత హత్య కేసుగా మార్చిన విషయం తెలిసిందే.