కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్‌కు జైలు
posted on: Feb 18, 2026 9:41AM

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుపై కోర్టు ధిక్కరణ నేరం రుజువు కావడంతో తెలంగాణ హైకోర్టు ఆయనకు ఆరు నెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే..తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక కేసు వివరాల్లోకి వెడితే.
మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మికి సంబంధించిన భూ వివాదంపై గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత భూమి పై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుని పిటిషనర్‌కు న్యాయం చేయాలని కోర్టు సూచించింది. అయితే ఆ ఉత్తర్వు లను అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం విఫలమైందని, కావాలనే పట్టించుకోలేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు, గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం సాధారణ పరిపాలనా లోపం కాదని, ఇది న్యాయ వ్యవస్థను అవమానించే చర్యగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తూ, కలెక్టర్ రాహుల్ రాజ్‌పై కోర్టు ధిక్కరణ నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పై కోర్టులో సవాల్ చేయడానికి వీలుగా తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ వ్యవధిలో కలెక్టర్ అప్పీల్ చేసు కునే అవకాశం కల్పించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే.. ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు లోనవుతారనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


.webp)



