విద్యుత్ ఉద్యోగుల సమస్యకి హైకోర్టు పరిష్కార మార్గం

 

తెలంగాణాలో వివిధ విద్యుత్ సంస్థల నుండి సుమారు 1200 మంది ఆంధ్రా మూలాలు ఉన్న ఉద్యోగులను స్థానికత కారణంగా ఉద్యోగాలలో నుంచి తొలగించబడ్డారు. తెలంగాణా ప్రభుత్వం వారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పజెప్పింది. కానీ వారిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వీకరించలేదు. తామందరం తెలంగాణా విద్యుత్ సంస్థల్లోనే పనిచేయాలనుకొంటున్నట్లు ఉద్యోగులు హైకోర్టుకి విన్నవించుకోవడంతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. కానీ అందుకు విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో గత నాలుగు నెలలుగా వారికి జీతాలు కూడా అందడం లేదు. రెండు ప్రభుత్వాల పంతాలు పట్టింపుల వలన మధ్యలో ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఆర్ధిక సమస్యలు, మనో వేదనకి గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు.

 

ఈ సమస్య పరిష్కారానికి హైకోర్టే ఒక మధ్యే మార్గం సూచించింది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన చెరో నలుగురు ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కమిటీకి రెండు రాష్ట్రాలకు చెందని ఒక మాజీ న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించబోతున్నట్లు తెలిపింది. కనుక రెండు ప్రభుత్వాలు ఈ కమిటీ కోసం తమ ప్రతినిధుల పేర్లను శుక్రవారంలోగా సూచించాలని ఆదేశించింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యపై ఆ కమిటీ తీసుకొనే నిర్ణయానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కనీసం ఈవిధంగానయినా ఉద్యోగుల సమస్య పరిష్కారం అయితే వారు, వారి కుటుంబాలు ఒడ్డున పడతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu